SAKSHITHA NEWS

అవయవదానానికి ముందుకు రావాలని
ప్రధాని నరేంద్ర మోదీ దేశవాసులకు పిలుపునిచ్చారు

ఈ ప్రక్రియను సులభతరం చేసేలా, పౌరులను ఈ దిశగా ప్రోత్సహించేలా తమ ప్రభుత్వం ఏకీకృత విధానాన్ని రూపొందిస్తోందని చెప్పారు. ఆదివారం నిర్వహించిన 99వ ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో కరోనా(COVID 19) కేసులు పెరుగుతుండటంపైన ప్రజలను అప్రమత్తం చేశారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

2013లో 5 వేలలోపు అవయవదానాలు చేయగా, 2022 నాటికి ఈ సంఖ్య 15 వేలకు పెరిగిందని ప్రధాని మోదీ తెలిపారు. ఇలా దేశంలో అవయవదానంపై అవగాహన పెరుగుతుండటం సంతృప్తికర విషయమని చెప్పారు. పుట్టిన 39 రోజులకే కన్నుమూసిన తమ కుమార్తె అవయవాలను దానం చేసిన అమృత్‌సర్‌కు చెందిన దంపతులతో ఈ సందర్భంగా మాట్లాడారు. ఇలాంటి దాతలు జీవితం విలువను అర్థం చేసుకుంటారంటూ అభినందించారు. సౌరశక్తి వంటి ‘క్లీన్‌ ఎనర్జీ’ రంగంలో భారత్‌ పాత్ర పెరుగుతోందన్నారు. పగటిపూట అవసరాలకు కేవలం క్లీన్‌ ఎనర్జీని వినియోగించే దేశంలోనే మొదటి జిల్లాగా ‘దియూ’ నిలిచిందని చెప్పారు.

త్రివిధ దళాలతోపాటు వివిధ రంగాల్లో నారీ శక్తి చాటుతోన్న సత్తాను ప్రధాని మోదీ కొనియాడారు. ఆసియాలో మొదటి మహిళా లోకో పైలట్‌గా గుర్తింపు పొందిన సురేఖ యాదవ్‌, ఆస్కార్‌ గెలుచుకున్న ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్’ డాక్యుమెంటరీ నిర్మాత గునీత్ మోంగా, దర్శకురాలు కార్తికి గోంజాల్వేస్ తదితరుల ఉదాహరణలను ప్రస్తావించారు. వారణాసిలో ‘కాశీ- తమిళ సంగమం’ కార్యక్రమం ద్వారా.. రెండు ప్రాంతాల ప్రజల మధ్య పురాతన సంబంధాలను ఉత్సవంగా నిర్వహించినట్లు చెప్పారు. ‘ఏక్‌ భారత్‌- శ్రేష్ఠ భారత్‌’ స్ఫూర్తితో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వచ్చే నెలలో 100వ ఎపిసోడ్ నేపథ్యంలో.. ప్రజలు తమ ఆలోచనలను పంచుకోవాలని కోరారు.


SAKSHITHA NEWS