Traffic restrictions on that route in Hyderabad for 40 days from today
హైదరాబాద్ లో ఆ రూట్ లో నేటి నుంచి 40 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: నగరంలోని అంబర్‌పేటలో ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో గాంధీ విగ్రహం వద్ద నుంచి అంబర్‌పేట టీ జంక్షన్ వరకు ఈ నెల 30వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు 40 రోజుల పాటు రోడ్డు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఆ రూట్‌లో వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్తూ, పోలీసులకు సహకరించాలని సూచించారు. గాంధీ విగ్రహం నుంచి 6 నంబర్ బస్టాప్ వరకూ వెళ్లే మార్గంలో (ఒకవైపు) వాహనాలను అనుమతించకుండా ఆంక్షలు విధించినట్టు చెప్పారు.
ఉప్పల్ వైపు నుంచి 6 నంబర్ బస్టాప్ మీదుగా చాదర్‌ఘాట్ వెళ్లే భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు హబ్సిగూడ క్రాస్‌రోడ్స్ నుంచి తార్నాక, ఉస్మానియా వర్సిటీ, అడిక్‌మెట్ ఫ్లైఓవర్, విద్యానగర్, ఫీవర్ దవాఖాన, బర్కత్‌పురా, నింబోలి అడ్డా వైపునకు వాహనాలను మళ్లించనున్నారు.
ఇక ఇదే మార్గంలో వెళ్లే సిటీ బస్సులు, సాధారణ వాహనాలను గాంధీ విగ్రహం నుంచి ప్రేమ్ సదన్ బాయ్స్ హాస్టల్, సీపీఎల్ అంబర్‌పేట్ గేట్, అలీఖేఫ్ క్రాస్‌రోడ్స్,. 6 నంబర్ బస్టాప్, గోల్నాక, నింబోలి అడ్డా మీదుగా చాదర్‌ఘాట్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఛే నంబర్ బస్టాప్ వైపు నుంచి ఉప్పల్ వైపు వెళ్లే అన్ని వాహనాలను అనుమతిస్తారు.