వినియోగదారులకు హక్కులతో పాటు బాధ్యతలూ తెలిసి ఉండాలి

Spread the love

Consumers should be aware of their rights as well as their responsibilities

వినియోగదారులకు హక్కులతో పాటు బాధ్యతలూ తెలిసి ఉండాలి. -అదనపు కలెక్టర్ వి. లక్ష్మీ నారాయణ

-జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా సమావేశంలో పాల్గొన్న అదనపు కలెక్టర్.
పెద్దపల్లి, సాక్షిత పెద్దపల్లి బ్యూరో :


వినియోగదారులు తమ హక్కులతో పాటు బాధ్యతలను తెలిసి ఉండాలనీ అదనపు కలెక్టర్ వి. లక్ష్మీ నారాయణ అన్నారు.
శనివారం జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ వి.లక్ష్మీ నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, మనం చెల్లించిన మొత్తానికి నాణ్యమైన వస్తువులను పొందడం వినియోగదారుల హక్కు అని, వినియోగదారులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉంటే నష్ట పోకుండా ముందు జాగ్రత్త పడవచ్చునని తెలిపారు.

వినియోగదారులు కోనుగోలు చేసే ప్రతి వస్తువు నాణ్యతను పరిశీలించాలని, ప్రకటనలకు ఆకర్షితులై మోసపోకూడదని, తప్పనిసరిగా సరి అయిన బిల్లు తీసుకోవాలని, జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.మనం జాగ్రత్తగా లేకుంటేనే అవతలి వ్యక్తి మోసం చేయడానికి ఎక్కువగా అవకాశం ఉన్నదని, కొంటున్న ప్రతి వస్తువుపై ముందుగానే అవగాహన కలిగి, నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్న వాటిని ఎంపిక చేసుకోవాలని, జాగ్రత్తలు పాటించి మోసపోయిన సందర్భంలో అట్టి వస్తువు, సేవలపై వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం పరిష్కారం పొందవచ్చని తెలిపారు.


ఏదైనా వస్తువు కొనుగోలు చేసినప్పుడు నాణ్యత లేదనో, ధర ఎక్కువగా తీసుకున్నారనో, ముగింపు తేదీ గడిచిందనో, తూకంలో తేడా ఉందని నిర్ధారణకు వచ్చినప్పుడు జిల్లా కేంద్రంలో ఉండే వినియోగదారుల ఫోరంలో నేరుగా ఫిర్యాదు చేయాలన్నారు. తూకంలో మోసాలపై స్థానికంగా ఉన్న తూనికలు, కొలతల శాఖ అధికారులకు కూడా ఫిర్యాదు చేయాలని, వారు చర్యలు తీసుకోని సందర్భంలో వినియోగదారుల ఫోరాన్ని సంప్రదించాలన్నారు.

కొనుగోలు చేసిన, నష్టం జరిగిన నాటి నుండి రెండేళ్ల లోపు ఫిర్యాదు చేయవచ్చని, ఆలస్యానికి తగిన కారణాలు చూపితే రెండేళ్ళు దాటిన తర్వాత ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉన్నదని, కొన్న వస్తువు, సేవల విలువ కోటి రూపాయల వరకు ఉంటే జిల్లా ఫోరంలో, కోటి రూపాయలకు మించి 10 కోట్ల వరకు రాష్ట్ర కమీషన్ లో ఫిర్యాదు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.


ఈ సందర్భంగా వినియోగదారులు మోసపోకుండా, మోసపోయిన సందర్భంలో తీసుకోవల్సిన అంశాలపై సంభందిత అధికారులు వివరించారు.వినియోగదారుల హక్కుల రక్షణ కోసం-1986లో ప్రభుత్వం వినియోగదార్ల హక్కు పరిరక్షణ చట్టాన్ని ప్రవేశ పెట్టిందన్నారు. ప్రస్తుత ఆధునిక డిజిటల్ యుగంలో వినియోగదార్ల విస్తత ప్రయోజనాలను దష్టిలో ఉంచుకొని ప్రస్తుత ప్రభుత్వం నూతన చట్టం వినియోగదార్ల పరిరక్షణ చట్టం-2019 తీసుకు వచ్చిందన్నారు.

వినియోగదారుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం నేషనల్ కన్సూమర్ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1800-11-4000 ను ఏర్పాటు చేసిందన్నారు.పాఠశాలల్లో విద్యార్థులకు వినియోగదారుల
హక్కులు, రక్షణ చట్టంపై అవగాహన కల్పించినట్లైతే వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి భవిష్యత్తులో మోసపోకుండా జాగ్రత్త పడవచ్చు అని తెలిపారు.ముందుగా వినియోగదారుల హక్కులు, కొనుగోలు సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై వివిధ పాఠశాల విద్యార్థినులు మాట్లాడారు.


ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి తోట వెంకటేష్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, బి.సి సంక్షేమ శాఖ అధికారి రంగా రావు, మార్కెటింగ్ శాఖ అధికారి ప్రవీణ్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, ఉపాధి కల్పన శాఖ అధికారి తిరుపతి రావు, లీగల్ మెట్రాలజి అధికారి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తెలంగాణ వినియోగదారుల ఫోరమ్ జిల్లా అధ్యక్షులు బెందే నాగభూషణం గౌడ్, ఉపాధ్యక్షులు మునిగాల సంపత్, ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాస్ మరియు వివిధ పాఠశాలల విద్యార్థినులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page