చిన్న పిల్లల హృదయాలయంలో గుండె మార్పిడి చికిత్సలు
- టీటీడీ ఈఓ ధర్మారెడ్డి
సాక్షిత, తిరుపతి బ్యూరో: టీటీడీ నిర్వహణలోని శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయంలో ఇకపై గుండె మార్పిడి ఆపరేషన్లు చేయనున్నట్లు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. టీటీడీ పాలక మండలి మాజీ సభ్యురాలు, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకురాలు సుధనారాయణమూర్తి తో కలసి మంగళవారం ఆయన ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రి లోని ఐసియు, జనరల్ వార్డులు, ఆపరేషన్ థియేటర్లను చూశారు. పిల్లల గుండె ఆపరేషన్ కోసం వచ్చిన బంగ్లాదేశ్, కోల్ కతా ప్రాంతాలకు చెందిన వారితో మాట్లాడారు. ఆసుపత్రి లో రోగులకు ఉచితంగా అందిస్తున్న సేవలు అద్భుతంగా ఉన్నాయని అభినందించారు. డాక్టర్లు, సిబ్బంది నిబద్ధతతో వైద్య సేవలు అందిస్తున్నారని చెప్పారు. ఆసుపత్రి కార్పొరేట్ స్థాయి కంటే బాగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ఆసుపత్రి ప్రారంభించిన ఆరు నెలల్లోనే 500 కు పైగా గుండె ఆపరేషన్లు ఉచితంగా నిర్వహించామని, వారం రోజుల వయసున్న పిల్లలకు కూడా విజయవంతంగా గుండె ఆపరేషన్లు చేశామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి సుధ నారాయణ మూర్తికి వివరించారు.
రూ 20 నుంచి 25 లక్షల ఖర్చయ్యే ఆపరేషన్లు ఉచితంగా చేస్తామన్నారు . ఇందుకోసం కొన్ని యంత్రాలు అవసరమవుతాయని వాటిని సమీకరించుకునే ప్రయత్నాల్లో ఉన్నామని ధర్మారెడ్డి వివరించారు . జెఈవో శ్రీ వీరబ్రహ్మం, ఈ కార్యక్రమంలో ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ రెడ్డి, ఆర్ ఎం ఓ డాక్టర్ భరత్ పాల్గొన్నారు.