SAKSHITHA NEWS

శివారు ప్రాంతాల్లో వేగంగా జరుగుతున్న నగరీకరణ, పట్టణీకరణలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించాలి: ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ ఈటల రాజేందర్ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వ పథకాల సమీక్షా సమావేశంలో భాగంగా నిర్వహించిన “దిశ” కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రు , ఎమ్మెల్యేలు కెపి.వివేకానంద్ , మల్లారెడ్డి , మర్రి రాజశేఖర్ రెడ్డి , బండారి లక్ష్మారెడ్డి , అరికెపూడి గాంధీ హాజరై స్థానికంగా నెలకొని ఉన్న సమస్యలు, చేపట్టవలసిన చర్యలపై చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని సమస్యలపై ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ….

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయాలలో 10% మూసి బాధితులకు ప్రభుత్వం ఇస్తామని అంటున్నా, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో వచ్చి ఉండేందుకు వారు ముందుకు రావడం లేదు. కాబట్టి మిగిలి ఉన్న ప్లాట్ లలో కనీసం 10% స్థానికంగా ఉన్నవారికి కేటాయింపులు చేపట్టాలి.

కుత్బుల్లాపూర్ లో వివిధ ప్రాంతాలలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయాల వద్ద లబ్ధిదారులకు ఇల్లు అప్పగించాము కానీ వారికి అవసరమైన మౌలిక వసతులను పూర్తిస్థాయిలో కల్పించలేదు. మౌలిక వసతుల కల్పనలో భాగంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయాల వద్ద అంగన్ వాడి సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, రేషన్ షాపులను ఏర్పాటు చేయాలి.

అదేవిధంగా ఎవరైనా చనిపోతే అంతిమ కార్యక్రమాలు నిర్వహించేందుకు స్థానికంగా ఎటువంటి స్మశాన వాటికలు లేవు. కావున ప్రభుత్వ స్థలాలలో (హిందూ, ముస్లిం, క్రిస్టియన్లతో పాటు ఇతరులకు) స్మశాన వాటికలకు స్థలాన్ని కేటాయించి అన్ని వసతులతో కూడిన స్మశాన వాటిక లను నిర్మించి ఇవ్వాలి.

అదేవిధంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయం వద్ద అన్నీ మతాల వారికి అనుగుణంగా ప్రార్థన మందిరాలు నిర్మించుకునేందుకు స్థలాలను కేటాయించాలి.

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 33 డివిజన్లలోని నడిచే 33 స్వచ్ఛ ఆటోలలో 30 ఆటోలు పాడైపోవడంతో చెత్త తరలింపులో తీవ్ర జాప్యం జరగడంతో ఎక్కడ వేసిన చెత్త అక్కడే ఉంటుంది. గతంలో పారిశుద్ధ నిర్వహణలో ఎన్నో “స్వచ్చ్ అవార్డు”లను తెలుసుకున్న నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో నేడు ఇటువంటి పరిస్థితి నెలకొని ఉండడం బాధాకరం. కాబట్టి వెంటనే ఈ సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలి.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానలకు మందులను రంగారెడ్డి జిల్లా నుంచి తీసుకురావాలంటే రవాణాలో తీవ్ర జాప్యం జరుగుతుందని కాబట్టి మందులను రంగారెడ్డి జిల్లా నుంచి కాకుండా మేడ్చల్ జిల్లా నుంచి సరఫరా చేసినట్లయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, బస్తీ దవాఖానాలకు వేగంగా మందులను అందజేయవచ్చు.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడి సెంటర్లో, హెల్త్ సెంటర్లలో మౌలిక వసతులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి మౌలిక వసతుల కల్పనకు అవసరమైన చర్యలను చేపట్టాలి.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేట్ రాజీవ్ గృహకల్ప, ప్రగతి నగర్ లోని 5వ, 32వ వార్డులను అంగన్ వాడి కేంద్రాలకు నూతన బిల్డింగులను నిర్మించడంతో పాటు నియోజకవర్గంలోని అన్ని సెంటర్లలో అంగన్వాడి టీచర్లు, ఆయాల కొరత తీవ్రంగా ఉన్నందున నూతన నియామకాలు చేపట్టి అంగన్వాడీలలో సిబ్బంది కొరతను తగ్గించాలి.

మధ్యాహ్న భోజనానికి వినియోగించే వంట సామాగ్రి కొరత కూడా తీవ్రంగా ఉన్నందున వంట సామాగ్రిని అందజేసినట్లయితే మధ్యాహ్న భోజన సిబ్బందికి ఉపయోగకరంగా ఉంటుంది.

దుండిగల్ మున్సిపాలిటీ పరిధి మల్లంపేటలోని మహేశ్వరం, బాచుపల్లి అంగన్వాడి సెంటర్లకు ఎటువంటి ప్రహరీ గోడ లేదు. అదేవిధంగా టాయిలెట్లను కూడా నిర్మించకపోవడంతో విద్యార్థులతోపాటు సిబ్బంది తీవ్ర అవస్థలు పడుతున్నారు. కాబట్టి వెంటనే ఈ అంగన్వాడి సెంటర్లలో ప్రహరీ గోడ, బాత్రూం నిర్మాణం పనులను వెంటనే చేపట్టాలి.


SAKSHITHA NEWS