SAKSHITHA NEWS

For the first date in AP....we need Rs.10 thousand crores

ఏపీలో ఒకటో తేదీకి….రూ.10 వేల కోట్లు కావాలి

-ఆన్ని రకాల పింఛన్లకు కలిపి రూ.4,408 కోట్లుజీతాలు,విశ్రాంత ఉద్యోగుల పింఛన్లకు రూ.5,500 కోట్లు

-సమీకరణ ప్రయత్నాల్లో అధికారులు…

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జులై ఒకటి నాటికి రూ.10వేల కోట్లు సమీకరించాలనే ప్రయత్నాల్లో ఉంది.

ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ఏప్రిల్‌ నుంచి పెంచిన వృద్ధాప్య పింఛన్లు, జులై నెల పింఛను, దివ్యాంగులకు పెంచిన పింఛన్లు కలిపి జులై ఒకటిన ఇవ్వాల్సి ఉంటుంది. ఏప్రిల్, మే, జూన్‌ నెలలకు సంబంధించి వృద్ధులకు పెంచిన పింఛను నెలకు రూ.1,000 చొప్పున బకాయిలనూ జులై 1న నేరుగా అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇవన్నీ కలిపి ఈ జులై నెలకు రూ.4,408.31 కోట్లు అవసరమవుతాయి. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఒకటో తేదీన జీతం అందుతుందేమో అన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ పింఛనుదారులదీ ఇదే ఆకాంక్ష. ఈ లక్ష్యం చేరాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. జులై ఒకటి నాటికి అన్నీ కలిపి ఎంత లేదన్నా రూ.10వేల కోట్లు అవసరమవుతాయి. అందుకు తగ్గట్టుగానే జూన్‌లో ప్రస్తుతం ఆర్థిక నిర్వహణ సాగుతోంది. ఇంతకాలం బిల్లుల చెల్లింపుల అధికారం ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి కె.వి.వి.సత్యనారాయణ వద్ద ఉండేది. జగన్‌ ప్రభుత్వ హయాంలో ఆయన ఇష్టారాజ్యంగా బిల్లులు చెల్లించడం వివాదాస్పదమయింది. ప్రస్తుతం ఆయన డిప్యుటేషన్‌ కాలం పూర్తయింది. రైల్వేశాఖ ఆయనను తమ సొంత శాఖకు వచ్చి రిపోర్టు చేయాలని ఉత్తర్వులిచ్చింది. అయినా రాష్ట్రప్రభుత్వం కేంద్రంతో సంప్రదించి ఆయన బదిలీని తాత్కాలికంగా ఆపించింది. ఆయన వద్ద ఉన్న బిల్లుల చెల్లింపు వ్యవహారాలన్నీ మరో ఉన్నతాధికారి సౌరభ్‌గౌర్‌ పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ సెలవులో ఉన్నారు. ఆర్థికశాఖలో కీలకాధికారులు సెలవులో ఉన్నారనే కారణంతో సత్యనారాయణను మరిన్ని రోజులు రాష్ట్రంలో ఉంచే ఏర్పాట్లు చేసినా.. జగన్‌ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలను వెలికితీయాలనే ఆయనను ఇక్కడ ఉంచారని విశ్వసనీయ వర్గాల కథనం.

జగన్‌ ప్రభుత్వం ఓట్ల లెక్కింపు రోజు కూడా బహిరంగ మార్కెట్‌ నుంచి రూ.4,000 కోట్ల రుణం తీసుకుంది. దీంతో కలిపి ఏప్రిల్, మే, జూన్‌ 4 వరకు రూ.25 వేల కోట్ల రుణం తీసుకున్నట్లయింది. ఏడాది మొత్తం వినియోగించాల్సిన రుణ వెసులుబాటును ఇష్టారాజ్యంగా వినియోగించి తమ అనుయాయుల అవసరాలు తీర్చుకునేందుకు ప్రయత్నించింది. తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక.. జూన్‌ 11న రుణం తీసుకురావడానికి పాత అధికారులు ప్రయత్నించారు. కానీ జులై నెల అవసరాలను దృష్టిలో ఉంచుకుని జూన్‌ 11న ప్రభుత్వం రుణ ప్రయత్నాలను విరమించుకుంది. వచ్చే వారం రుణసమీకరణ చేసి ఆ నిధులను జీతాలు, సామాజిక పింఛన్లు, ఉద్యోగుల పింఛన్లకు వినియోగించాలనే ప్రణాళికతో ఉన్నట్లు సమాచారం.

ఆరు నెలలకు రూ.47 వేల కోట్లకే అనుమతి

కేంద్రం ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ తొలి తొమ్మిది నెలలకు రుణ పరిమితిని నిర్ణయిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు నెలలకు రూ.47వేల కోట్ల బహిరంగ మార్కెట్‌ రుణం తీసుకునేందుకు అనుమతులు ఇచ్చింది. అందులో జగన్‌ ప్రభుత్వం రూ.25వేల కోట్లు సమీకరించింది. సెప్టెంబరు వరకు మరో రూ.22వేల కోట్ల బహిరంగ మార్కెట్‌ రుణం తీసుకునే అవకాశం ఉంది. రాబోయే పది రోజుల రాబడులు, కొంత రుణం, వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సులను కలిపి జులై 1 నాటి అవసరాలు తీరేలా ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. ఉద్యోగులకూ జులై 1న జీతాలిచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

WhatsApp Image 2024 06 20 at 13.01.03

SAKSHITHA NEWS