SAKSHITHA NEWS

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్


ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి ఓటర్ స్లిప్పుల పంపిణీ వంద శాతం చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. నూతన కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఆర్డీవోలు, తహశీల్దార్లతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నిర్వహణ, ధరణి పెండింగ్ దరఖాస్తులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ కు, తమ ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో వుందో తెలియాల్సిన అవసరం ఉందని, ఈ దృష్ట్యా ఓటర్ స్లిప్పుల పంపిణీ, నమోదైన ప్రతి ఓటరుకు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఓటర్ స్లిప్పుల పంపిణీ సంబంధిత బిఎల్ఓ ద్వారా చేపట్టాలని, ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు పంపిణీ పురోగతిపై నివేదిక సమర్పించాలని అన్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేయాలని, ఏవేని చిన్న చిన్న మరమ్మత్తులు ఉంటే, వెంటనే పూర్తి చేయాలని తెలిపారు. ఎన్నికల సిబ్బందికి ఎస్ఆర్ అండ్ బిజీఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో మొదటి విడత శిక్షణ ఈ నెల 20న, రెండో విడత శిక్షణ ఈనెల 26న చేపట్టబడునని ఆయన అన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ఎస్ఆర్ అండ్ బిజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల గ్రౌండ్ లో ఏర్పాట్లు చేయాలన్నారు. ఈనెల 26న డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుండి పోలింగ్ సామాగ్రి తీసుకొని, సంబంధిత పోలింగ్ కేంద్రానికి వెళ్లి, అక్కడే బస చేయాలన్నారు. రిసిప్షన్ కేంద్రం నల్గొండ లోని నాగార్జున కళాశాలలో ఉంటుందని, ఈ నెల 27న పోలింగ్ పిమ్మట నేరుగా రిసిప్షన్ కేంద్రానికి పోలీస్ ఎస్కార్ట్ తో వెళ్లాలని ఆయన తెలిపారు. ఎన్నికల నిర్వహణకు 15 రూట్లు, ప్రతి రూటుకు రూట్ ఆఫీసర్ ని నియమించామన్నారు. తహశీల్దార్లు సెక్టార్ అధికారులుగా, నయాబ్ తహశీల్దార్లు ఫ్లయింగ్ స్క్వాడ్ గా, ఆర్ఐ లు ప్రత్యేక వీడియో టీమ్ లుగా నియమించినట్లు, శుక్రవారం నుండే తమ విధుల నిర్వహణ చేపట్టాలని ఆయన తెలిపారు. ప్రత్యేక వీడియో టీమ్ కు వీడియోగ్రాఫర్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్, ఆర్డీవోలు సహాయ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారని ఆయన అన్నారు. ఓటింగ్ విధానంపై ఓటర్లకు అవగాహన కలిగేలా విస్తృత ప్రచారం చేపట్టాలని, ఓటింగ్ విధానం, చేయదగినవి, చేయకూడని పనులపై ఫ్లెక్సీ రూపొందించి, పోలింగ్ కేంద్రాల వద్ద ప్రదర్శించాలన్నారు. పోలింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్ అనుమతించవద్దని ఆయన అన్నారు. ఇండిలిబుల్ ఇంక్ ఎడమచేతి మధ్య వ్రేలుకు పెట్టాలన్నారు.
ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలన్నారు. ప్రతిరోజు తహసీల్దార్ కనీసం 20 ఫైళ్లు సమర్పించాలన్నారు. రిజిస్ట్రేషన్ లలో పెండింగ్ స్లాట్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు.

 ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, డిఆర్డీఓ ఎం. రాజేశ్వరి, ఎడి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాసులు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ శ్రీలత, కలెక్టరేట్ ఏవో అరుణ, సూపరింటెండెంట్లు మదన్ గోపాల్, అనురాధ బాయి, రాంబాబు, సత్యనారాయణ, ఓఎస్డీ నాగేశ్వరరావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS