న్యూఢిల్లీ:-న్యాయవాదులంతా తప్పనిసరిగా శిక్షణ పొందాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. న్యాయమూర్తులు శిక్షణ కోసం నేషనల్ జ్యుడీషియల్ అకాడమీకి వెళ్తున్నారని, అలాంటప్పుడు న్యాయవాదులు ఎందుకు శిక్షణ పొందడం లేదు?అని ప్రశ్నించింది. గుర్తింపు పొందిన న్యాయ విశ్వవిద్యాలయం నుంచి సర్టిఫికేట్ ఉంటే తప్ప ప్రాక్టీస్ చేయడానికి న్యాయవాదులను అనుమతించకూడదని పేర్కొంది. పశ్చిమ బెంగాల్ టీచర్ల రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో అరెస్టైన టీఎంసీ ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్య కుమారుడు సౌవిక్ భట్టాచార్య బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. భట్టాచార్య తరపున కోర్టుకు హాజరైన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదించారు. సమన్లు జారీ చేయనప్పటికీ బెయిల్ కోసం ట్రయల్ కోర్టులో ఒక న్యాయవాది దరఖాస్తు చేశారని అన్నారు.
కాగా, ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తులు బేలా ఎం త్రివేది, పంకజ్ మిథాల్‌తో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. జడ్జీలకు శిక్షణ కోసం నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ ఉండగా, లాయర్ల కోసం అలాంటి లా అకాడమీ ఎందుకు లేదు? అని ప్రశ్నించింది. తప్పు చేసిన న్యాయవాదులపై బార్ కౌన్సిల్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించింది.
మరోవైపు న్యాయవాదులకు సరైన అవగాహన కల్పించాలని సుప్రీంకోర్టు సూచించింది. దీని కోసం ఏదైనా చేయాలని కోరింది. ‘సీనియర్ న్యాయవాదులతో సహా ప్రతి లాయర్‌కు తప్పనిసరిగా శిక్షణ ఉండాలి. న్యాయమూర్తులు నేషనల్ జ్యుడీషియల్ అకాడమీకి వెళ్లగలిగితే, శిక్షణ కోసం లాయర్లు ఎందుకు వెళ్లకూడదు? గుర్తింపు పొందిన న్యాయ విశ్వవిద్యాలయం నుంచి సర్టిఫికేట్ ఉంటే తప్ప, వారిని ప్రాక్టీస్ చేయడానికి అనుమతించకూడదు. విదేశాలలో ఇలాంటి విధానం ఉంది. ఇది ఎవరికీ తెలియనిది కాదు. సమస్య ఏమిటంటే ఎవరూ దానిని అమలు చేయకూడదనుకుంటున్నారు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
కాగా, కోర్టు ద్వారా ఏదైనా సమన్లు జారీ చేశారా అన్నది ధృవీకరించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తరపున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను వారానికి వాయిదా వేసింది.