ధరణి పోర్టల్‌తో రైతుల భూములను ఎవరూ గోల్మాల్ చేయలేరని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. భద్రాచలం, పినపాక నియోజకవర్గాల బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ బూర్గంపాడులో జరిగింది.
సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ అభ్యర్థులు రేగా కాంతారావు, తెల్లం వెంకట్రావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ధరణి పోర్టల్‌తో రైతుల భూములను ఎవరూ గోల్మాల్ చేయలేరని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. భద్రాచలం, పినపాక నియోజకవర్గాల బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ బూర్గంపాడులో జరిగింది. సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ అభ్యర్థులు రేగా కాంతారావు, తెల్లం వెంకట్రావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఎన్నికలకు చాలా సమయం ఉన్నది. గ్రామాలు, పట్టణాలకు బస్తీలకు వెళ్లిన తర్వాత పెద్ద మనుషులతో చర్చ పెట్టాలి. నిజానిజాలు తేల్చాలి. వాస్తవాలను గమనించి ముందుకుపోతే మన బతుకులు బాగుపడుతయ్. లేక పోతే దెబ్బతింటాం. బాధలు పడుతాం’ అన్నారు.
పార్టీల వైఖరిపై చర్చ చేయాలి..
‘బీఆర్ఎస్ పుట్టుక మీ కండ్లముందే జరిగింది. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల హక్కులు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. కాంగ్రెస్ చరిత్ర మీకు తెలుసు. 120-130 సంవత్సరాల కిందట పుట్టింది. బీఆర్ఎస్ పార్టీ చరిత్ర కూడా మీముందుంది. ఈ పార్టీల వైఖరిపై బాగా చర్చచేయాలని కోరుకుంటున్నా. ఈ ఎన్నిక పినపాక వరకు భద్రాచలం వరకో ఉండదు. ఇక్కడ గెలిచే అభ్యర్థులను బట్టి రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ ప్రభుత్వం సరైన నడక నడిస్తే ప్రజాబాహుల్యానికి మేలు జరుగుతుంది. లేకపోతే నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ గిరిజనులు విశేషంగా ఉండే ప్రాంతం. గిరిజనులతో పాటు దళిత వర్గాల ప్రజలు ఉన్నరు. వాళ్ల బతుకులు బాగా లేవు. వాళ్లకు భూములు కూడా లేవు. అది వాస్తవం’ అన్నారు.
దళితుల బతుకులు అట్లనే ఎందుకున్నయ్..?
‘దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా.. దళితుల బతుకులు అట్లనే ఎందుకున్నయ్ ? దీనికి బాధ్యలు ఎవరూ ? యుగయుగాలు, తరతరాలుగా అణచివేబడ్డ జాతికి స్వతంతం వచ్చిన తెల్లవారి నుంచే మంచి కార్యక్రమాలు పెట్టి ఉంటే దళితుల బతుకులు ఇలా ఉండేవి కావు. అందు కోసమే తెలంగాణ ప్రభుత్వం దళితబంధు కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. తెలంగాణ వచ్చిన నాడు పరిస్థితి ఏంటో మీకు తెలుసు. కరెంటు, తాగు, సాగునీటి సమస్యలు. చేనేత కార్మికుల ఆత్మహత్యలు, రైతుల వలసలు, ఆకలి చావులు. అప్పులు కట్టలేక.. బోర్లు వేయలేక.. కరెంటు సరిగా రాక దారుణమైన పరిస్థితి ఉండేది. ఎలా వెళ్లాలో అర్థంకాని పరిస్థితి. కష్టపడి రాష్ట్రం తెచ్చుకున్నాం కాబట్టి బాధ్యతతో పటిష్టంగా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ముందుకెళ్లాలని కంకణబద్ధులమై పని చేశాం’ అని తెలిపారు.
మా ప్రాధాన్యం వాటికే..
‘పది సంవత్సరాల పరిస్థితి, చరిత్ర మీ కండ్ల ముందున్నది. అన్నింటికన్నా ముందు మేం ఇచ్చిన పాధ్రాన్యం. రోడ్లు, సాగునీరు, తాగునీరు, కరెంటు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాం. మీరందరూ చూస్తున్నారు. మీ ముందే మణుగూరులో భద్రాద్రి పవర్ ప్లాంట్ వచ్చింది. ఒకప్పుడు వాస్తవానికి వీటీపీఎస్ విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ మణుగూరులో రావాల్సింది. కానీ, సమైక్యవాదులు కుట్ర చేసి మణుగూరుకు రాకుండా విజయవాడకు తరలించారు. అందువల్ల మనం చాలా నష్టపోయాం. కనీసం చిన్నదైనా సరే ఇక్కడైనా రావాలని చెప్పి మణుగూరులో పవర్ ప్లాంట్ పెట్టుకున్నాం. ఎంతో కొంత మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దాని ద్వారా లభిస్తున్నయ్. అన్నింటిని మించింది ప్రధాన రంగం వ్యవసాయరంగం. రైతులు అప్పుల్లో ఉన్నారు. అప్పులు కట్టలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. ఆ బాధలు పోవాలని.. రైతులు చక్కగా బతకాలని.. వ్యవసాయ స్థిరీకరణ జరగాలని ఎన్నో ప్రయత్నాలు చేశాం. అందులో విజయం సాధించాం’ అన్నారు.
దేశంలో దుర్మార్గమైన పాలసీలతో రైతులకు సపోర్ట్ లేదు.
‘ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ప్రభుత్వం సపోర్ట్ లేకుండా వ్యవసాయం నిలబడలేదు. అన్ని దేశాల్లో సబ్సిడీలు ఇచ్చి వ్యవసాయానికి సపోర్ట్ చేస్తున్నాయ్. మన దేశంలో ఉన్న దుర్మార్గమైన పాలసీల వల్ల రైతులకు ఎలాంటి సపోర్ట్ లేదు. అందుకే మన దగ్గర రెండు మూడు కార్యక్రమాలు తీసుకున్నాం. రైతులకు ప్రాజెక్టుల ద్వారా నీటి సరఫరా చేస్తే నీటి తీరువా లేదు. గతంలో ఉన్న బకాయిలను రద్దు చేశాం. మోటర్లు కాలిపోకుండా నాణ్యమైన 24గంటలు ఉచితంగా ఇస్తున్నాం.
పెట్టుబడి సాయం ఇస్తున్నాం. రైతులకు ఏదైనా ఇబ్బంది జరిగి చనిపోతే ఆ వారి ఇంటికి రూ.5లక్షలు వారం రోజుల్లో వస్తున్నయ్. రైతుబీమా బ్రహ్మాండంగా పని చేస్తున్నది. రైతుల గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. వీటన్నింటిని తీసుకువచ్చి ధరణి పోర్టల్ తీసుకువచ్చాం. ప్రభుత్వం తన వద్ద ఉన్న అధికారాన్ని మీకే ఇచ్చింది. మీ భూమి యాజమాన్యం మారాలంటే.. గతంలో ప్రభుత్వ అధికారులు మార్చేది. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. మీ బొటన వేలు పెడితే తప్ప.. మీ భూమిని ఎవరూ గోల్మాల్ చేయలేరు. ఇప్పుడిప్పుడే రైతులు తేరుకుంటున్నర్. అప్పుల నుంచి తేరుకుంటున్నరు’ అన్నారు.