SAKSHITHA NEWS

24న కాచిగూడ-యశ్వంత్‌పూర్‌ ‘వందేభారత్‌’ ప్రారంభం…

చెన్నై: హైదరాబాద్‌, బెంగళూరు మధ్య వందేభారత్‌ రైలు ఈ నెల 24 (ఆదివారం)న ప్రారంభం కానుంది. కాచిగూడ- యశ్వంత్‌పూర్‌ (బెంగళూర్‌) మధ్య రాకపోకలు సాగించే ఈ రైలును ఆదివారం మధ్యాహ్నం 12.30కు ప్రధాని నరేంద్రమోదీ దిల్లీ నుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభించనున్నారు. కాచిగూడ రైల్వేస్టేషన్‌ వేదికగా జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రైల్వే ఉన్నతాధికారులు పాల్గొంటారు. సోమవారం నుంచి ఈ రైలు కాచిగూడలో ఉదయం 5.30కు బయలుదేరి.. మహబూబ్‌నగర్‌, కర్నూలు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం స్టేషన్ల మీదుగా మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్‌పూర్‌ చేరుకుంటుంది. తిరిగి 2.45కు యశ్వంత్‌పూర్‌లో బయలుదేరి, రాత్రి 11.15కు కాచిగూడ చేరుకుంటుంది. దీంతో సహా ఈ నెల 24న ప్రధాని మోదీ ఒకేసారి 9 వందేభారత్‌ రైళ్లను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. వాటిలో విజయవాడ-చెన్నై వందేభారత్‌ కూడా ఉందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు విజయవాడలో ప్రారంభమై తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా చెన్నై సెంట్రల్‌కు చేరుకుంటుంది. గురువారం మినహా మిగిలిన రోజుల్లో నడిచే ఈ రైలు రోజూ ఉదయం విజయవాడలో 5.30కు బయలుదేరి మధ్యాహ్నం 12.10కి చెన్నై చేరుకుంటుంది. తిరిగి చెన్నైలో మధ్యాహ్నం 3.20కి బయలుదేరి విజయవాడకు రాత్రి 10 గంటలకు వస్తుంది.
నీ చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్‌)లో తయారైన కాషాయ రంగు వందేభారత్‌ తొలి రైలును కేరళ రాష్ట్రానికి కేటాయించారు. కాసర్‌గోడ్‌ నుంచి తిరువనంతపురం వయా అలెప్పి మార్గంలో ఈ సర్వీసును నడపాలని రైల్వేబోర్డు అధికారులు దక్షిణ రైల్వే అధికారులకు సమాచారం అందించారు.


SAKSHITHA NEWS