హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో యువతకు ఆశలు కల్పించిన కేసీఆర్ ఇప్పుడు ఎక్కడ మాయమైపోయారని బీజేపీ నేత డీకే అరుణ ప్రశ్నించారు..
మీడియాతో మాట్లాడుతూ.. సెంటిమెంట్ పేరుతో కేసీఆర్ నిరుద్యోగ యువత ప్రాణాలు బలి తీసుకున్నారని ఆరోపించారు. 12 వందల మంది ఉసురుపోసుకొని గద్దెనెక్కిన చరిత్ర కేసీఆర్‌ది అన్నారు. అసెంబ్లీ సాక్షిగా లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న కేసీఆర్.. నిరుద్యోగులుగానే ఉంచారన్నారు. నిరుద్యోగ ఆశలను కేసీఆర్ నెరవేర్చలేదని.. ఇప్పటి వరకు డీఎస్సీ వేయకపోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేకపోవడం సిగ్గు చేటన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ప్రశ్నపత్రాలు లీక్ చేశారని..ప్రశ్నపత్రాలు లీక్ చేసిన వారిపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ప్రశ్నపత్రాలు లీక్ చేసిన వారిపై చర్యలు తీసుకోలేదంటే ప్రభుత్వం హస్తం ఉన్నట్లే అని బీజేపీ నేత ఆరోపించారు.
కాంట్రాక్ట్ వ్యవస్థ ఇంకా ఎందుకు నడుస్తుందో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడు లబ్ధి పొందేందుకు అనేక ప్రకటనలు ఇస్తు మరోసారి మోసం చేశారన్నారు.