SAKSHITHA NEWS

WhatsApp Image 2023 09 13 at 12.50.22

హైదరాబాద్:
స్కూల్‌ అసిస్టెంట్‌ ఎస్‌ఏ, నుంచి ప్రధానోపాధ్యాయుడు హెచ్‌ఎం,గా పదోన్నతి కల్పించే విషయంలో సీనియారిటీ తారుమారవుతోందని పలువురు టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లైన్‌ విధానంలో తప్పులు దొర్లుతున్నాయని పలు ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ఈ నెల 3న ప్రారంభమైంది. ఈ ఏడాది జనవరిలో బదిలీల కోసం 78 వేల మంది అప్లై చేసుకున్నారు. ఫిబ్రవరి 1న కాకుండా సెప్టెంబర్‌ 1కి కటాఫ్‌ పెంచడంతో మరో ఏడు వేలు వచ్చాయి. పదోన్నతుల ప్రక్రియను ఎంఈవోలు, డీఈవోల పరిధిలో నిర్వహిస్తూ, వాళ్లే సీనియారిటీని రూపొందిస్తున్నారు.

జాబితాల్లో పొరపాట్లు
జోనల్ విధానం ప్రధాన సమస్య కాగా, సీనియారిటీ జాబితాలో పొరపాట్లు దొర్లుతున్నాయని పలువురు టీచర్ల ద్వారా డీఈవోలకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. మల్టీజోన్ల పరిధిలో మాదిరి సీనియారిటీ జాబితాలను విడుదల చేయడంతో ఈ గందరగోళం నెలకొన్నట్లు టీచర్లు చెబుతున్నారు.

రెండు మల్టీజోన్ల పరిధిలో 1,974 హెచ్‌ఎం పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. మూడేళ్ల సర్వీస్‌లోపు ఉన్న వారు దాదాపు వెయ్యి మందికిపైగా ఉన్నారు. నిబంధనల ప్రకారం మూడేళ్ల సీనియారిటీ ఉంటే బదిలీకి అవకాశం ఉండదు. కానీ ప్రమోషన్‌కు ఈ నిబంధన వర్తించదు. ప్రమోషన్‌ వచ్చాక మల్టీజోనల్‌ పరిధిలో ఉండే జిల్లాలోని పోస్టు ఎంత దూరం ఉన్నా వారువెళ్లి జాయిన్ కావాల్సిందే. ఈ కారణంగా సర్వీసు తక్కువగా ఉన్నా దాదాపు 800 మంది వరకు పదోన్నతిని తిరస్కరించే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో అప్పుడు పాత చోటే పోస్టు ఇస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

రిటైర్‌ మెంట్ వయసులో హెచ్‌ఎం ప్రమోషన్‌ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి చాలా మంది ఆసక్తి చూపడం లేదు. ఈ కారణంగా 1,974 పోస్టులు పూర్తిస్థాయిలో ప్రమోషన్లతో భర్తీ అయ్యే అవకాశం లేదు.

జోనల్‌ సమస్య
2022లో జోనల్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రధానోపాధ్యాయులు మల్టీజోనల్‌ పరిధిలోకి వస్తారు. రెండు జోన్‌లుగా విభజించి, ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మెదక్‌తో పాటు కామారెడ్డి:సిద్దిపేటను మల్టీజోన్‌–1లో చేర్చారు. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్‌ ఉమ్మడి జిల్లాలతో పాటు సంగారెడ్డిని మల్టీజోన్‌–2 పరిధిలోకి తెచ్చారు.

జోనల్‌ వ్యవస్థ లేనప్పుడు జిల్లా సీనియారిటీ ప్రాతిపదికగానే పదోన్నతులు కల్పించారు. అక్కడి పోస్టులు, ఖాళీలకు అనుగుణంగా ప్రమోషన్లు ఇచ్చారు. ఈ కారణంగా కొన్ని జిల్లాల్లో ఎక్కువ సర్వీసు ఉన్నవారికి పదోన్నతులు రాలేదు. కొన్ని జిల్లాల్లో తక్కువ సర్వీసు ఉన్నా హెచ్‌ఎంలుగా ప్రమోషన్లు వచ్చాయి. ఇప్పుడు మల్టీజోన్‌ వారీగా సీనియారిటీని నమోదు చేయాలంటే పెద్ద సమస్య అవుతుంది….


SAKSHITHA NEWS