భారీ వర్షాలకు గుజరాత్ అతలాకుతలం.. 29 మరణాలు..
అహ్మదాబాద్: గుజరాత్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో ఇప్పటివరకు దాదాపు 29 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
అలాగే..సుమారు 40 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొన్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ఇప్పటికే సుమారు 300 మందిని వరదల నుంచి కాపాడాయి.
మరోవైపు.. ఇవాళ( గురువారం) రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 22 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. రెడ్ అలర్ట్ ప్రకటించిన ప్రాంతాల్లో.. కచ్ఛ్, ద్వారక, జామ్‌నగర్, మోర్బీ, సురేంద్రనగర్, జునాగఢ్, రాజ్‌కోట్, బొటాడ్, గిర్సోమ్‌నాథ్, అమ్రేలి, భావ్‌నగర్‌లతో కూడిన కచ్ , సౌరాష్ట్ర ఉన్నాయి. అదేవిధంగా ఉత్తర గుజరాత్, మధ్య గుజరాత్, దక్షిణ గుజరాత్‌లకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో నదులు, డ్యాముల్లో నీటి మట్టాలు పెరిగాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.బుధవారం సుమారు 6వేల మందిని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలు తరలించినట్లు అధికారులు తెలిపారు.
గుజరాత్‌లో ఇప్పటివరకు కురిసిన వర్షం.. సగటు వార్షిక వర్షపాతంలో 105 శాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. భారీ వర్షంతో అజ్వా, ప్రతాపురా రిజర్వాయర్ల నుంచి నీటిని విశ్వామిత్ర నదిలోకి విడుదల చేశారు. దీంతో వరద నీరు లోతట్టు ప్రాంతాలను జలమయం చేశాయి. నది తీర ప్రాంతాలైన వడోదర, ఇతర నగరాల్లోకి గ్రామాల్లోని కొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 12 అడుగుల్లో నీరు నిలిచింది.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రధాని మోదీ గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌కు ఫోన్ చేసిన పరిస్థితిని ఆరా తీశారు. భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న గుజరాత్‌కు అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.