SAKSHITHA NEWS

శివ పురాణంలోని కోటిరుద్ర సంహితలో శివుని 12 జ్యోతిర్లింగాల గురించి వివరంగా వివరించబడ్డాయి. ఈ పురాతన 12 జ్యోతిర్లింగాల క్షేత్రాల్లో శివలింగాలలో శివుడు నివసిస్తున్నాడని నమ్మకం. హిందూ మతంలో 12 జ్యోతిర్లింగాల ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

సోమనాథ జ్యోతిర్లింగం: గుజరాత్‌లోని సౌరాష్ట్రలో ఉన్న ఈ జ్యోతిర్లింగం భూమిపై అత్యంత పురాతన జ్యోతిర్లింగంగా పరిగణించబడుతుంది. శివపురాణం ప్రకారం సోమనాథ జ్యోతిర్లింగాన్ని చంద్రుడు స్వయంగా స్థాపించాడు.

మల్లికార్జున జ్యోతిర్లింగం : 12 జ్యోతిర్లింగాల్లో మల్లికార్జునుడు రెండవ లింగం. ఈ జ్యోతిర్లింగం భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా నది ఒడ్డున శ్రీశైలం అనే పర్వతంపై నెలకొని ఉంది. ఈ ఆలయాన్ని దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు దర్శనం, పూజలతో అశ్వమేధ యాగం చేయడం వలన వచ్చే పుణ్యముతో సమానమైన పుణ్యము లభిస్తుందని విశ్వాసం.

మహాకాళేశ్వర జ్యోతిర్లింగం: ఈ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరంలో ఉంది. అందుకే ఉజ్జయిని మహాకాళేశ్వర నగరం అని కూడా అంటారు. మహాకాళేశ్వరం ఒక్కటే దక్షిణాభిముఖంగా ఉన్న జ్యోతిర్లింగం. ఇక్కడ రోజుకు 6 సార్లు శివునికి హారతి ఇస్తారు. ఇది భస్మ హారతితో ప్రారంభమవుతుంది. మహా కాల సమయంలో ఉదయం 4 గంటలకు భస్మ హారతి నిర్వహిస్తారు. దీనిని మంగళ హారతి అని కూడా అంటారు. మహాకాళేశ్వర జ్యోతిర్లింగ భస్మ హారతి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది

ఓంకారేశ్వర జ్యోతిర్లింగం: ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సమీపంలోని మాల్వా ప్రాంతంలో ఉంది. ఈ జ్యోతిర్లింగం చుట్టూ ప్రవహించే నదులు, పర్వతాలు ఓం ఆకారంలో దర్శనం ఇస్తాయి. నర్మదా నదికి ఉత్తరాన ఉన్న ఏకైక దేవాలయం ఇదే. ఇక్కడ శివుడు నదికి రెండో ఒడ్డున కొలువై ఉన్నాడు. శివుడు ఇక్కడ మామలేశ్వరుడు, అమలేశ్వరుడుగా భక్తులతో పూజలను అందుకుంటున్నాడు.

కేదార్‌నాథ్ జ్యోతిర్లింగం: సముద్ర మట్టానికి 3584 మీటర్ల ఎత్తులో మందాకిని నది ఒడ్డున ఉన్న కేదార్‌నాథ్ ఆలయం ఉత్తర భారతదేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఈ జ్యోతిర్లింగం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ జిల్లాలో హిమాలయాల్లో కేదార్ అనే శిఖరంపై ఉంది.

భీమశంకర జ్యోతిర్లింగం: ఈ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని పూణే సమీపంలో 110 కిలోమీటర్ల దూరంలో సహ్యాద్రి అనే పర్వతంపై ఉంది. మహాదేవుడి 12 జ్యోతిర్లింగాలలో భీమశంకర జ్యోతిర్లింగం ఆరవ జ్యోతిర్లింగంగా పరిగణించబడుతుంది. ఇక్కడి స్థానిక ప్రజలకు మోటేశ్వర మహాదేవ అనే పేరుతో ఈ ఆలయాన్ని కూడా పిలుస్తారు.

కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం: ఈ జ్యోతిర్లింగం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో గంగా నది ఒడ్డున ఉంది. ఈ జ్యోతిర్లింగాన్ని విశ్వేశ్వరుడు అని కూడా అంటారు. ఈ పదానికి అర్థం ‘విశ్వానికి పాలకుడు’.

త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం: ఈ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉంది. ఈ జ్యోతిర్లింగానికి సమీపంలో ఉన్న బ్రహ్మగిరి అనే పర్వతంలో గోదావరి నది పుట్టింది. దక్షిణ భారతదేశంలో గోదావరి నదిని పాప వినాసిని గంగా నదితో సమానంగా పరిగణిస్తారు. గంగానది భూమి మీదకు అవతరించడంలో భగీరథుడి ప్రయత్నం ఎంతగా ఉందో.. అదేవిధంగా గోదావరి నది ప్రవాహానికి గౌతమ మహర్షి తపస్సు ఫలం అని నమ్మకం.

వైద్యనాథ జ్యోతిర్లింగం: ఈ జ్యోతిర్లింగం జార్ఖండ్ రాష్ట్రంలోని సంతాల్ పరగణా సమీపంలో ఉంది. శివుని ఈ బైద్యనాథ్ ధామ్‌ను చితాభూమి అని పిలుస్తారు. బైద్యనాథ్ ధామ్ మొత్తం 12 శివ జ్యోతిర్లింగ ప్రదేశాల్లో ముఖ్యమైనది. ఎందుకంటే ఇది భారతదేశంలోని 51 శక్తిపీఠాలలో ఒకటి సతీ దేవి హృదయం ఇక్కడ పడింది. కనుక దీనిని హృదయపీఠం అని కూడా అంటారు.

నాగేశ్వర జ్యోతిర్లింగం: ఈ జ్యోతిర్లింగం గుజరాత్‌లోని ద్వారక ప్రాంతంలో ఉంది. రుద్ర సంహితలో శివుడు ‘దారుకావన నాగేశం’గా వర్ణించబడ్డాడు. నాగేశ్వర్ అంటే పాముల దేవుడు. జాతకంలో సర్పదోషం ఉన్నవారికి ఇక్కడ లోహాలతో చేసిన పాములను ప్రసాదంగా అందజేస్తారు.

రామేశ్వరం జ్యోతిర్లింగం: ఈ జ్యోతిర్లింగం తమిళనాడులోని రామేశ్వరంలో ఉంది. ఈ జ్యోతిర్లింగాన్ని శ్రీరాముడు స్వయంగా తన చేతులతో తయారు చేశాడు. చార్ ధామ్‌లో రామేశ్వర తీర్థం ఒకటి. ఇక్కడ ఉన్న శివలింగాన్ని దర్శించినంత మాత్రాన అన్ని రోగాల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు.

ఘృష్ణేశ్వర దేవాలయం జ్యోతిర్లింగ: ఈ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని దౌల్తాబాద్ సమీపంలో ఉంది. శివుని 12 జ్యోతిర్లింగాలలో ఇదే చివరి జ్యోతిర్లింగం. ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం భోలేనాథ్ భక్తుడైన ఘుష్మా భక్తికి చిహ్నంగా పరిగణించబడుతుంది. అతని పేరు మీదుగా ఈ శివలింగానికి ఘుష్మేశ్వర్ అని పేరు వచ్చింది.

శివ పురాణం ప్రాముఖ్యత: శివ భక్తులందరికీ శివ పురాణానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. శివపురాణంలో, పరమేశ్వరుడైన పరమశివుని దయగల రూపం, ఆరాధన, రహస్యం, మహిమ, ఆరాధన గురించి వివరించబడింది. శివపురాణాన్ని పద్దతిగా పఠించడం, భక్తితో వినడం వల్ల మనసుకు సంతృప్తి కలుగుతుంది. శివ పురాణం ప్రకారం, మనిషి శివభక్తి ద్వారా అత్యున్నత స్థితికి చేరుకుంటాడు, శివైక్యం పొందుతాడు. ఈ పురాణాన్ని నిస్వార్థంగా, భక్తితో వినడం ద్వారా.. అన్ని పాపాల నుండి విముక్తి పొందుతాడు. జీవితంలో గొప్ప ఆనందాలను అనుభవించి, చివరకు శివలోకాన్ని పొందుతాడని నమ్మకం..

WhatsApp Image 2024 03 08 at 9.15.41 AM

SAKSHITHA NEWS