రైతు సమస్యలపై రాజీలేని పోరాటమే సీపీఎం లక్ష్యం

Sakshitha news

రైతు సమస్యలపై రాజీలేని పోరాటమే సీపీఎం లక్ష్యం

నవంబర్ 15న నల్గొండలో కిసాన్ మహాసభల బహిరంగ సభకు రైతులు తరలిరావాలి

బోనకల్‌లో సీపీఎం మధిర డివిజన్ విస్తృతస్థాయి సమావేశం

బోనకల్,
రైతుల సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటాలు నిర్వహిస్తూ, రైతుల ఆర్థిక అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలతో ముందుకు సాగుతామని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు అన్నారు. బోనకల్ మండల కేంద్రంలోని వి.వి.ఆర్. ఫంక్షన్ హాల్‌లో దొండపాటి నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన సీపీఎం మధిర డివిజన్ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

నవంబర్ 15న నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ఆలిండియా కిసాన్ జాతీయ మహాసభల సందర్భంగా జరిగే బహిరంగ సభకు మధిర డివిజన్ పరిధిలోని ప్రతి గ్రామం నుంచి రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గత మూడు సంవత్సరాల కాలంలో రైతు సమస్యలపై నిర్వహించిన పోరాటాలు, సాధించిన విజయాలను మహాసభల్లో సమీక్షించనున్నట్లు తెలిపారు. రాబోయే మూడు సంవత్సరాల్లో రైతుల సమస్యల పరిష్కారంతో పాటు రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై సమగ్ర ప్రణాళిక రూపొందించనున్నట్లు పేర్కొన్నారు.

వీర తెలంగాణ పోరాట స్ఫూర్తితో ఉద్యమాలు

కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో సాగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పేదల భూమి, భుక్తి, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన చారిత్రాత్మక పోరాటమని సమావేశంలో నాయకులు గుర్తుచేశారు. 1948 నుంచి 1952 వరకు సాగిన ఆ పోరాటంలో జమీందారులు, పటేల్, పట్వారీ వ్యవస్థల దోపిడీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పేద ప్రజలను సంఘటితం చేసి పోరాడారని తెలిపారు. ఆ పోరాట ఫలితంగా లక్షల ఎకరాల భూమి పేదలకు దక్కిందని పేర్కొన్నారు. నాటి పోరాట స్ఫూర్తితోనే నేటి రైతాంగ సమస్యలపై కూడా నిరంతర ఉద్యమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

సీపీఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు మాట్లాడుతూ సెప్టెంబర్ 12న సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి వర్ధంతి సందర్భంగా ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహించనున్న సెమినార్‌కు పార్టీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

ఈ సమావేశంలో సీపీఎం జిల్లా మాజీ కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు, మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాల్ రావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కళ్యాణ వెంకటేశ్వరరావు తదితరులు ప్రసంగించారు.

పార్టీ సీనియర్ నాయకులు చింతలచెరువు కోటేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మెరుగు సత్యనారాయణ, ఎర్ర శ్రీనివాస్ రావు, వ్యవసాయ కార్మిక సంఘం మధిర డివిజన్ కార్యదర్శి పాపినేని రామ నరసయ్య, రైతు సంఘం మధిర డివిజన్ అధ్యక్షులు దివ్వెల వీరయ్య, మహిళా సంఘం మధిర డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు జోన్నలగడ్డ సునీత, పయ్యావుల ప్రభావతి, నవతెలంగాణ ఖమ్మం జిల్లా మేనేజర్ ఎస్.డి. జావీదు, జిల్లా సర్కులేషన్ ఇన్‌చార్జి ఇరుగు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
అలాగే ముదిగొండ, చింతకాని, బోనకల్, మధిర అర్బన్, మధిర రూరల్, ఎర్రుపాలెం మండలాల సీపీఎం కార్యదర్శులు బట్టు పురుషోత్తం, ఉపేందర్, కిలారు సురేష్, పడకంటి మురళి, మంద సైజులు, మద్దాల ప్రభాకర్‌తో పాటు డివిజన్, మండల కమిటీ సభ్యులు, శాఖ కార్యదర్శులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.