SAKSHITHA NEWS

World's tallest idol of Shiva is unveiled today

నేడు ప్రపంచంలోనే ఎత్తయిన శివయ్య విగ్రహావిష్కరణ

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పరమేశ్వరుడి విగ్రహం నేటి నుంచి భక్తుల దర్శనమివ్వడానికి సిద్ధమైంది. రాజస్థాన్‌లో ఏర్పాటైన ఈ శివుడి విగ్రహం నేటి నుంచి ప్రజలకు దర్శనమివ్వనుంది.

రాజ్‌సమంద్‌ జిల్లాలోని నాథ్‌ద్వారాలో నెలకొల్పిన 369 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహాన్ని ఇవాళ.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మొరారి బాపు సమక్షంలో ఆవిష్కరించనున్నారు.

విశ్వాస్‌ స్వరూపం’ పేరుతో శివుడు ధ్యాన ముద్రలో ఉన్నట్లు ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఈ శిల్పం 20 కి.మీ. దూరం నుంచి కూడా కనిపించేలా ఏర్పాటు చేశారు.

తత్‌ పదం సంస్థాన్‌ ట్రస్టీ, మిరాజ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ మదన్‌ పాలీవాల్‌ ఆధ్వర్యంలో దీన్ని నిర్మించారు. 3 వేల టన్నుల ఇనుము, ఉక్కు, 2.5లక్షల ఘనపు టన్నుల కాంక్రీట్‌, ఇసుక వినియోగించి, 10 ఏళ్లపాటు శ్రమించి దీని నిర్మాణం పూర్తి చేశారు.

గంటకు 250 కి.మీ. వేగంతో వచ్చే గాలులను సైతం తట్టుకొనేలా, 250 ఏళ్ల పాటు నిలిచి ఉండేలా దీన్ని బలంగా నిర్మించినట్లు నిర్వాహకులు తెలిపారు.

విగ్రహ ప్రాంగణంలో బంగీ జంపింగ్‌, గో-కార్ట్‌ తదితర వినోద, సాహస క్రీడల సదుపాయాలను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు.

విగ్రహావిష్కరణ సందర్భంగా నవంబరు 6 వరకూ ఇక్కడ ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు….


SAKSHITHA NEWS