“మహిళలకు హక్కులు మాటల్లో కాదు.. చట్టాల్లో కనిపించాలి”…
చట్టసభల్లో 33% మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి…
–సీపీఐ నాయకులు కవ్వంపల్లి స్వామి…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:గోదావరి ఖని,మహిళ మహిళా సాధికారత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాలని, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లును ఎలాంటి నిబంధనలు లేకుండా వెంటనే అమలు చేయాలని సీపీఐ సీనియర్ నాయకులు, ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి డిమాండ్ చేశారు.
గోదావరిఖని భాస్కర్ రావు భవన్‌లో నిర్వహించిన జాతీయ మహిళా సమాఖ్య 72వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
పార్లమెంటేరియన్ గీతా ముఖర్జీ పోరాటాల ఫలితంగా మహిళా రిజర్వేషన్ బిల్లు ముందుకు వచ్చినప్పటికీ, నేటికీ దానిని అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం బూటకపు హామీలతో మహిళలను మభ్యపెడుతోందని విమర్శించారు. కుంటి సాకులు చెప్పకుండా వెంటనే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు.
దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడంలో పాలక ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మరింత పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించి సంఘాన్ని బలోపేతం చేయాలని మహిళలకు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు మడికొండ ఓదెమ్మ మహిళా సమాఖ్య పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మహిళలు కేక్ కట్ చేసి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి కనకరాజు, మహిళా సమాఖ్య నాయకులు ఆసాల రమ, శనిగరపు తిరుమల, సీపీఐ ప్రజా సంఘాల నాయకులు కరీం, శేఖర్, ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
