ప్రజల భాగస్వామ్యంతోనే నేరరహిత సమాజం సాధ్యం”…
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక గ్రామ సభల్లో ప్రజా భద్రతపై అవగాహన కల్పించిన రామగుండం పోలీసులు….
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: రామగుండం, నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రామగుండం పోలీస్ కమీషనరేట్ అధికారులు పిలుపునిచ్చారు.
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు గురువారం రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలో ప్రతి పోలీస్ స్టేషన్‌కు చెందిన గ్రామాలు, వార్డుల్లో నిర్వహించిన గ్రామ సభల్లో డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడి గ్రామాల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నేరాల నియంత్రణ, ప్రజల రక్షణ, భద్రత, చట్టాలపై అవగాహన, సీసీ కెమెరాల ప్రాముఖ్యత, యువత సామాజిక బాధ్యత వంటి పలు అంశాలపై అవగాహన కల్పించారు.
“అరైవ్ అలైవ్” కార్యక్రమంపై అవగాహన
రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, నాలుగు చక్రాల వాహనదారులు సీట్‌బెల్ట్ ధరించడం ద్వారా ప్రాణనష్టాలను తగ్గించవచ్చని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం ప్రమాదాలకు ప్రధాన కారణాలని పేర్కొన్నారు.
షీ టీమ్ సేవలపై అవగాహన
మహిళలు, బాలికల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఈవ్‌టీజింగ్, సైబర్ వేధింపులు వంటి ఘటనలపై వెంటనే ఫిర్యాదు చేయాలని, షీ టీమ్ సేవలను నిర్భయంగా వినియోగించుకోవాలని సూచించారు.
గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన
మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును నాశనం చేయడమే కాకుండా కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరించారు. మాదకద్రవ్యాల విక్రయం, రవాణా, వినియోగం చట్టరీత్యా శిక్షార్హమైన నేరమని పేర్కొన్నారు.
సైబర్ నేరాల నివారణపై సూచనలు
ఆన్‌లైన్ మోసాలు, ఫేక్ కాల్స్, నకిలీ వెబ్‌సైట్లు, ఓటీపీ మోసాలు, డిజిటల్ అరెస్ట్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యక్తిగత బ్యాంకు వివరాలు, పాస్‌వర్డ్లు, ఓటీపీలు ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని తెలిపారు.
ఇతర సామాజిక అంశాలపై అవగాహన
సామాజిక మాధ్యమాల బాధ్యతాయుత వినియోగం, బాల్య వివాహాల నివారణ, మహిళలు, బాలల రక్షణ, ప్రజా శాంతిభద్రతల పరిరక్షణ వంటి అంశాలపై కూడా అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ, ప్రజలు చట్టాలను గౌరవిస్తూ పోలీస్ శాఖకు సహకరించాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలపై వెంటనే సమాచారం అందించాలని కోరారు. ప్రజల సహకారంతోనే సురక్షితమైన, నేరరహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ఈ గ్రామ సభ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువత, ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
