పెంచిన గ్యాస్ ధరలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. కుత్బుల్లాపూర్ లో మహిళల వినూత్న నిరసన…
సిలిండర్ లపై పూలు చల్లి.. వెనక్కి పంపుతూ.. డౌన్ డౌన్ మోదీ అంటూ నినాదాలు…
ధరలు పెంచి కేంద్రం పేదల నడ్డి విరుస్తోందన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
సాక్షిత : కేంద్ర ప్రభుత్వం మరోసారి గ్యాస్ సిలిండర్ ధరలను పెంచి పేదల నడ్డి విరుస్తోందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ మండిపడ్డారు. ‘ప్రగతి యాత్ర‘ అనే కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని మాణిక్య నగర్ లో ఎమ్మెల్యే పర్యటిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా స్థానిక మహిళలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సిలిండర్లపై పూలు చల్లి వెనక్కి పంపుతూ పెంచిన ధరల భారం తాము మోయలేమంటూ డౌన్ డౌన్ మోదీ.. అని నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒకేసారి డొమెస్టిక్ సిలిండర్‌పై 50 రూపాయలు.. కమర్షియల్ సిలిండర్‌పై 350 రూపాయలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ సర్కార్ కు ఎన్నికల వేళ కామన్ మ్యాన్ గుర్తుకు వస్తాడని, ఎన్నికలు ముగియడంతోనే కార్పోరేట్ మ్యాన్ గుర్తుకు వస్తాడన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయో లేదో.. గ్యాస్ సిలిండర్ ధరలను అమాంతం పెంచారని ఎమ్మెల్యే విమర్శించారు.
మోదీ అసమర్థ పాలనలో తిరిగి కట్టెల పొయ్యిలపై వండుకునే రోజులు రానున్నాయన్నారు. తన మిత్రుడు గౌతమ్ అదానీ నష్టపోయిన కోట్లాది డాలర్ల అవినీతి సొమ్మును మోదీ సామాన్య ప్రజల నుంచి ఈ విధంగా రికవరీ చేస్తాడని, సామాన్య, పేద ప్రజలను దోచి, రక్తం పిండి, ధనికులకు పెట్టే గజ దొంగలు కేంద్రంలోని బీజేపీ నేతలు అని అన్నారు. పెంచిన ధరలతో హైదరాబాద్‌లో డొమెస్టిక్ సిలిండర్ ధర 1155 రూపాయలకు చేరిందని.. నిన్నటి దాకా 1700 రూపాయలున్న కమర్షియల్ సిలిండర్ ధర ఇవాళ్టి నుంచి 2100ను దాటిందన్నారు.
గతంలో సిలిండర్ ధర పెరిగితే సబ్సిడీ కూడా పెరిగేదని, కానీ ఇప్పుడు సబ్సిడీ కూడా ఎత్తి వేయడంతో ప్రజల జేబులకు భారీగా చిల్లు పడుతుందన్నారు. నానాటికీ పెంచుతున్న సిలిండర్ ధర వల్ల ప్రజలపై ఆర్థిక భారం పడుతుందన్నారు. గత 2014లో 410 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు మోదీ హయాంలో 1155 రూపాయలకు చేరిందంటే.. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం తేటతెల్లమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ మరియు నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.