SAKSHITHA NEWS

ఢిల్లీ మద్యం స్కామ్‌లో డబ్బులెలా చేతులు మారాయి?

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితపై ఈడీ అధికారుల ప్రశ్నల వర్షం

కోర్టులో హాజరు.. కస్టడీ పొడిగింపు కోరే అవకాశం

23న కవిత వేసిన బెయిల్‌ పిటిషన్‌పైనా విచారణ

మద్యం కుంభకోణం కేసులో ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ప్రశ్నల వర్షం కురిపించింది. హోలీ సందర్భంగా విచారణకు విరామం ఇస్తారని.. ఒకవేళ విచారించినా గంటో, రెండు గంటలో ప్రశ్నిస్తారని కవితతోపాటు కుటుంబసభ్యులు భావించారు. కానీ.. కస్టడీచివరిరోజు కావడంతో ఈడీ అధికారులు ఆమె నుంచి రాబట్టాల్సిన సమాచారంపై ప్రత్యేక శ్రద్థ పెట్టారు. ముఖ్యంగా.. ఈ వ్యవహారంలో కవిత మేనల్లుడు మేక శరణ్‌ పాత్ర ఏమిటి? డబ్బులు ఎలా చేతులు మారాయి? ఎవరెవరి మధ్య లావాదేవీలు జరిగాయి? తదితర అంశాలపై ఈడీ ఆమెను ప్రశ్నించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అలాగే.. కవిత, ఆమె భర్త అనిల్‌, వ్యక్తిగత సహాయకుల నుంచి స్వాధీనం చేసుకున్న మూడు ఫోన్లలోని డేటాను కవిత ముందుంచి, ఆ సమాచారంపైన కూడా ప్రశ్నించారని.. మద్యం వ్యాపారి సమీర్‌ మహేంద్ర పాత్రపై ఆరా తీశారని తెలుస్తోంది. కాగా.. ఇప్పటికే రెండుసార్లు కవితను కస్టడీకి తీసుకుని విచారించిన ఈడీ అధికారులు మంగళవారం మధ్యాహ్నం 11 గంటలకు మరోసారి ఆమెను రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. కవిత నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉన్నందున ఆమెను మరో ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని వారు కోరనున్నట్టు తెలిసింది.

బెయిల్‌ పిటిషన్‌ పైనా..

ఢిల్లీ మద్యం పాలసీ కేసు రాజకీయ కక్షసాధింపు చర్యలో భాగమేనని పేర్కొంటూ ఈ నెల 23న రౌస్‌ అవెన్యూ కోర్టులో కవిత బెయిల్‌ పిటిషన్‌ వేయగా.. 26న విచారిస్తామని న్యాయమూర్తి తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. కవితను ఈడీ కోరినట్టు కస్డడీకి ఇస్తారా? జ్యుడీషియల్‌ రిమాండ్‌కు పంపుతారా? లేక బెయిల్‌పై విడుదల చేస్తారా? అనేది మంగళవారం తేలనుంది. కాగా, సోమవారం సాయంత్రం 7 గంటలకు కవితను ఆమె భర్త అనిల్‌తోపాటు న్యాయవాది మోహిత్‌ రావు కలిశారు. మంగళవారం కోర్టు ముందుకు రానున్న బెయిల్‌ పిటిషన్‌పై వారు చర్చించినట్టు తెలిసింది. ఈడీ అధికారులు మళ్లీ కస్టడీ కోరితే ఏం చేయాలి? బెయిల్‌ నిరాకరిస్తే భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి? అనే అంశాలపై వారు చర్చించినట్టు సమాచారం..

WhatsApp Image 2024 03 26 at 12.53.12 PM

SAKSHITHA NEWS