మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్, వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది.
కేసు విచారణలో వేధిస్తున్నారంటూ కొన్నేళ్ల క్రితం వివేకా పీఏ కృష్ణారెడ్డి కోర్టును ఆశ్రయించడంతో, కోర్టు ఆదేశాల మేరకు వీరిపై కేసులు నమోదయ్యాయి.
తాజాగా తదుపరి చర్యలు నాలుగు వారాలు నిలుపుదల చేయాలంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో వీరికి ఊరట లభించినట్లయింది.
వివేకా హత్య కేసులో కొందరు తనను బెదిరిస్తున్నారనే ఆరోపణతో వివేకా పీఏ కృష్ణారెడ్డి 2021 డిసెంబరులో పులివెందుల కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. పులివెందులకు చెందిన కొందరు నాయకుల ప్రమేయం ఉన్నట్లు సాక్ష్యం చెప్పాలని సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్ ఒత్తిడి చేస్తున్నారని, అదే విధంగా సీబీఐ అధికారులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలంటూ వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి ఒత్తిడి చేశారని ఆరోపించారు.
దీంతో 2023 డిసెంబరు 8వ తేదీన కృష్ణారెడ్డి ఫిర్యాదుపై పులివెందుల కోర్టు విచారణ జరిపింది. కేసు నమోదు చేసి జనవరి 4న తుది నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. దీంతో పులివెందుల పోలీసులు సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌పై కేసు నమోదు చేశారు. అభియోగపత్రం దాఖలు చేశారు. పులివెందుల కోర్టు ఇచ్చిన ఉత్తర్వులతోపాటు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ సునీత, రాజశేఖర్‌రెడ్డి, ఎస్పీ రామ్‌సింగ్ పిటిషన్లు దాఖలు చేశారు.
తాజాగా జరిగిన విచారణలో వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, ఎస్పీ రామ్ సింగ్‌కు ఊరట లభించింది. వీరిపై తదుపరి చర్యలు నాలుగు వారాల పాటు నిలుపుదల చేసిన హైకోర్టు, విచారణను ఈనెల 29కి వాయిదా వాయిదా వేసింది.