హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ విచారణ నేపథ్యంలో ముందస్తు బెయిల్‌కు ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు అవినాష్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని సీబీఐ నోటీసులు ఇచ్చిందని అవినాష్‌రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని హైకోర్టును ఆయన కోరారు. ఎంపీ అభ్యర్థనపై మధ్యాహ్నం 2.30గంటలకు హైకోర్టు విచారణ జరపనుంది.
బెయిల్ పిటిషన్‌లో అవినాష్‌రెడ్డి కీలక అంశాలను పేర్కొన్నారు. ‘‘వివేకా హత్యతో నాకు ఎలాంటి సంబంధం లేదు. దస్తగిరి వాంగ్మూలం మేరకు నన్ను ఇరికించాలని సీబీఐ చూస్తోంది. నిందితుడిగా చేర్చి అరెస్టు చేసే ఉద్దేశంలో సీబీఐ ఉంది. ఆశ్చర్యంగా గూగుల్ టేకవుట్ డేటాను తెరపైకి తెచ్చింది. ఒక వ్యక్తి ఎక్కడున్నారో గూగుల్ టేకవుట్ డేటా చెప్పలేదు. నాలుగేళ్లలో అనేక పరిణామాల తర్వాత నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. నన్ను అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి.. ఒక వేళ అరెస్టు చేస్తే బెయిల్‌పై విడుదల చేసేలా ఆదేశించాలి’’ అని బెయిల్ పిటిషన్‌లో అవినాష్ కోరారు.