SAKSHITHA NEWS

సాక్షిత*తిరుపతి నగరం
ఈనెల 24వ తేది జరగనున్న తిరుపతి 894వ పుట్టిన రోజు పండగను అంతా కలసి ఘనంగా చేసుకుందాం రండి అని ఆహ్వానిస్తూ తిరుపతి గాంధీరోడ్డులో టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, ఎమ్మెల్సి సిపాయి సుబ్రమణ్యం, మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణతో కలిసి సాయంత్రం ఆహ్వాన పత్రాలను ప్రజలకి అందజేశారు. స్వయంగా తన చేతులతో ఫ్లెక్సీ కట్టి పురప్రజలకు ఆహ్వానం చాటారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ ఈనెల 24వ తేదీన తిరుపతి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు.

ప్రపంచంలో మనషులు, జంతువులకు మాత్రమే పుట్టిన రోజు పండగలు నిర్వహించుకునే పరిస్థితి ఉందని, ప్రాంతాలకు పుట్టిన రోజులు లేవని, కానీ వేంకటేశ్వర స్వామి వెలసిన మన తిరుపతికి మాత్రమే పుట్టిన రోజు ఉందన్నారు. జగద్గురు రామానుజాచార్యులు వారి అమృత హస్తాలతో తిరుపతికి 24.02.1130 న శంకుస్థాపన చేశారని తెలిపారు. తిరుమల అర్చకుల కోసమే ఏర్పాటు చేసిన తిరుపతికి అప్పట్లో గోవింద రాజపురంగా నామకరణ చేశారని చెప్పారు.

ఇందుకు చారిత్రక ఆధారాలు ఉన్నాయన్నారు. గత రెండేళ్లుగా తిరుపతి పుట్టిన రోజు పండగను వైభవోపేతంగా నిర్వహిస్తున్నామని, ఈసారి కూడా మరింత గొప్పగా నిర్వహించ తలపెట్టినట్టు చెప్పారు. అందువల్ల తిరుపతి ప్రజలు ఈ నెల 24వ తేది ఉదయం 8.30 గంటల నుంచి తిరుపతి శ్రీ గోవింద రాజస్వామి ఆలయం వద్ద నిర్వహించే పవిత్ర శోభా యాత్రలో పాల్గొని, విజయవంతం చేయాలని భూమన కరుణాకర రెడ్డి పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, కార్పొరేటర్లు శేఖర్ రెడ్డి, కోటూరు ఆంజినేయులు, నాయకులు తోండమనాటి వెంకటేష్ రెడ్డి, ఉదయ్ వంశీ, కట్టా గోఫి యాదవ్, బస్వా బాలసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 02 22 at 6.02.21 PM

SAKSHITHA NEWS