సాక్షిత తిరుపతి నగరం:
రాష్ట్రాన్ని అభివృద్ది వైపుకు తీసుకెలుతున్న జగనన్నకు ఓట్లు వేసి మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుందామని ప్రజలనుద్దేశించి టీటీడీ చైర్మెన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, కమిషనర్ హరిత ఐఏఎస్ ముఖ్య అతిథిలుగా తిరుపతి రాజీవ్ గాంధీ కాలనీలో నాలుగో విడత వైఎస్సార్ ఆసరా వారోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ తిరుపతి లో 3,234 సంఘాలకు చెందిన 28,810 మంది అక్క చెల్లెమ్మలకు 31.66కోట్ల రూపాయలు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జగనన్న జమ చేశారని తెలిపారు.
గత ఎన్నికల్లో ఇచ్చిన మాటకు జగనన్న కట్టుబడి, డ్వాక్రా అక్క చెల్లమ్మల రుణాలను మాఫీ చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడున్నర లక్షల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల కింద అందించారని వెల్లడించారు. గతంలో డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణ మాఫీ చేస్తామంటూ చంద్రబాబు హామీ ఇచ్చి అధికారం లోకి వచ్చిన తర్వాత ఒక్క పైసా కూడా రుణ మాఫీ చేయలేదని విమర్శించారు. అయితే జగనన్న రాష్ట్ర బడ్జెట్ అంతా పేదోళ్లకే ఖర్చు చేస్తున్నారని తెలిపారు. బాబు వస్తే జాబు వస్తుందని, విద్యార్థులకు సైకిళ్లు, కంప్యూటర్లు ఇస్తామని చెప్పిన చంద్రబాబు ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని భూమన విమర్శించారు. జగనన్న జీవకోనలోనే ఆరున్నర వేల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి, సమూలంగా మార్చేసిన ఘనత జగనన్నదే అన్నారు. వృద్ధులకు మూడు వేల ఫించన్ జనవరి ఒకటో తేదీ నుంచి జగనన్న ఇస్తున్నారని తెలిపారు.
జగనన్న ఆశీస్సులతో తిరుపతి దేశంలోనే అత్యున్నత స్థాయికి చేరిందన్నారు. కొత్త రోడ్లతో మరో కొత్త తిరుపతి ఏర్పాటైందని భూమన పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో జగనన్నకు ఓట్లు వేసి, మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని భూమన కోరారు. తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్ధి, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న జగనన్నకు మద్ధతుగా నిలవాలని, ఈ ఎన్నికల్లో ఓట్లు వేసి జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని కోరారు. జగనన్న ఆశీస్సులతో చేపట్టిన తిరుపతి అభివృద్ధిని చూసి తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న తనకు ఓట్లు వేసి తిరుపతి ఎమ్మెల్యేగా గెలిపించి తిరుపతి అభివృద్దికి మరింత సేవ చేసే అవకాశం కల్పించాలని భూమన అభినయ్ రెడ్డి అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడి రాధమ్మ, కార్పొరేటర్లు కోటేశ్వరమ్మ, నారాయణ, నాయకులు దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, తలారి రాజేంద్ర, సురేంధ్రనాధ్ రెడ్డి, బాలిశెట్టి కిశోర్, మెప్మా కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు