సాక్షిత తిరుపతి నగరం:
అభివృద్ధి, సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున అందిస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి పిలుపు నిచ్చారు. ఆంద్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావలంటే నినాదంతో తిరుపతిలో మధ్యాహ్నం జరిగిన కార్యక్రమాల్లో భూమన కరుణాకర రెడ్డి తిరుపతి ఎమ్మెల్యే హోదాలో పాల్గొని స్థానికులను ఉద్దేశించి ప్రసంగించారు. 19 డివిజన్లో 30 కోట్ల రూపాయలు, 32 వ డివిజన్లో 24 కోట్ల రూపాయలు, 46 వ డివిజన్లో 45 కోట్ల రూపాయలు, 8 వ డివిజన్లో 30 కోట్ల రూపాయల మేరకు ప్రజల కోసం ఖర్చు చేశామన్నారు. తిరుపతి అభివృద్ధి, సంక్షేమానికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుమారు 1,700 కోట్ల రూపాయలు ఖర్చు చేశారన్నారు.
చంద్రబాబు తన పాలనలో రాష్ట్రమంతా కలిపి 1,700 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, తిరుపతి అభివృద్ధికి 30 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయలేదన్నారు. పేదలకు మేలు చేయాలన్న తపనతో జగనన్న సంక్షేమ పథకాలను అందిస్తుంటే, చంద్రబాబు ఎన్నికల సమయంలో మాత్రమే దొడ్డి దారిలో ఎలా అధికారంలోకి రావాలో అని కుట్రతో పథక రచన చేస్తాడని భూమన ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుపతిలోనే 26,400 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు 500 కోట్ల రూపాయల వ్యయంతో ఇళ్లు కూడా కట్టిస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో మూడు లక్షల 35వేల కొట్ల రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. జగనన్నను గెలిపించుకుంటే ప్రజలు గెలుస్తారని, అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలందరికీ ఇంత కంటే ఎక్కువగా అందుతాయని తెలిపారు. జగనన్న చేయూత వల్లే దేశం లోనే ఓ ఆదర్శ నగరంగా తిరుపతి అభివృద్ధి చెందుతోందని భూమన గుర్తు చేశారు.