ఓటరు జాబితాలో పారదర్శకతే ప్రాధాన్యం….
ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్‌ను గడువులోగా పూర్తి చేయాలి….
–రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: పెద్దపల్లి, : ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్‌ను తక్షణమే పూర్తి చేయడంతో పాటు, మొత్తం ప్రక్రియను పారదర్శకంగా, తప్పిదాలకు తావులేకుండా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ నుంచి ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం పురోగతిపై అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి అదనపు (రెవెన్యూ) కలెక్టర్ బి. శ్రీరాములు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు ప్రతి నమోదును క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. నమోదైన సమాచారాన్ని పూర్తి పారదర్శకతతో నమోదు చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఓటరు జాబితాలోని డూప్లికేట్ నమోదులు, అసాధారణ వ్యత్యాసాలు, మ్యాపింగ్ సమస్యలు, ఇతర సాంకేతిక అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఫోటో సరిపోలని ఓటర్ల వివరాలను తప్పనిసరిగా సరిచేయాలని సంబంధిత సిబ్బందికి ఆదేశించారు.
పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణలో భాగంగా ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు వేర్వేరు కేంద్రాల్లో నమోదై ఉంటే వారందరినీ ఒకే పోలింగ్ కేంద్ర పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. కుటుంబ సభ్యుల వివరాలను సమగ్రంగా పరిశీలించి ప్రతి కుటుంబానికి ఒకే పోలింగ్ కేంద్రం ఉండేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.
18 సంవత్సరాలు పూర్తి చేసిన ప్రతి అర్హుడిని ఓటరుగా నమోదు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని, క్షేత్రస్థాయి అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ ప్రతి దరఖాస్తు, అభ్యంతరాన్ని ఎన్నికల నిబంధనల ప్రకారం నిష్పాక్షికంగా పరిశీలించాలని సూచించారు.
రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఎస్‌ఐఆర్ ప్రక్రియపై పూర్తి వివరాలు తెలియజేయాలని, సమావేశాలకు సంబంధించిన వివరాలను తప్పనిసరిగా నమోదు చేసి భద్రపరచాలని అధికారులను ఆదేశించారు.
ప్రత్యేక సవరణ కార్యక్రమం సవరించిన షెడ్యూల్‌ను కచ్చితంగా అమలు చేయాలని పేర్కొన్న ఆయన, ఆగస్టు 10 నాటికి ఇంటింటి ఎన్యూమరేషన్, ధృవీకరణ, ఫారాల సమర్పణ, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ పూర్తి చేయాలని సూచించారు. ఆగస్టు 17న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసి, సెప్టెంబర్ 16 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపారు. అనంతరం పరిశీలన పూర్తి చేసి అక్టోబర్ 19న తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామని వెల్లడించారు.
ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY