ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యే లక్ష్యం….

Sakshitha news

ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యే లక్ష్యం….

వెనుకబడిన పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి….

–జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష…

సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి, : జిల్లాలో ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా మండల స్థాయిలో సమర్థవంతమైన ప్రణాళికతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మండల విద్యాధికారులు (ఎంఈఓలు), కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్లను ఆదేశించారు.

సమీకృత జిల్లా కలెక్టరేట్ (ఐడీఓసీ) సమావేశ మందిరంలో విద్యాశాఖ పనితీరుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ పలు కీలక సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. మండల స్థాయిలో ఎంఈఓలు, కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్లు సమన్వయంతో పనిచేస్తూ విద్యా ప్రమాణాల పెంపునకు నాయకత్వం వహించాలని తెలిపారు.

ముఖ్యంగా వెనుకబడిన పాఠశాలలను గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని, విద్యార్థుల అభ్యాస స్థాయిని మెరుగుపరిచేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాజ్ఞానం, ముఖ గుర్తింపు నమోదు వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.

ఉపాధ్యాయులకు ఇచ్చిన శిక్షణ ఫలితాలు తరగతి గదిలో ప్రతిబింబించేలా పర్యవేక్షణ చేపట్టాలని పేర్కొన్నారు. ఎంఈఓలు, కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్లు పాఠశాలలను క్రమం తప్పకుండా తనిఖీ చేసి, ప్రతి తనిఖీ వివరాలను నిర్దేశిత ఆన్‌లైన్ విధానంలో నమోదు చేయాలని ఆదేశించారు.

పాఠశాల తనిఖీల సమయంలో కనీసం 45 నిమిషాల పాటు తరగతి గదిలో ఉండి బోధనా విధానం, విద్యార్థుల అభ్యాస స్థాయిని పరిశీలించాలని, అవసరమైన సూచనలు నమోదు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

పాఠశాలల పరిశుభ్రత, పాఠ్యపుస్తకాలు, అభ్యాస పుస్తకాలు, నోట్‌బుక్స్ అందుబాటు, వాటి వినియోగం, ఉపాధ్యాయుల బోధనా విధానం వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. విద్యార్థుల ప్రాథమిక చదవడం, రాయడం, లెక్కించే నైపుణ్యాలను ప్రత్యక్షంగా పరీక్షించి అవసరమైన మెరుగుదల చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రతి విద్యార్థి ప్రాథమిక అభ్యాస సామర్థ్యాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించి, జిల్లాలో విద్యా ప్రమాణాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో పీఎం షేక్, మండల విద్యాధికారులు, కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Scroll to Top