బెజవాడ నడిబొడ్డున మహమేధావి విగ్రహావిష్కరణ.
రండి తరలిరండి…కదలిరండి.
-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం,
దేశమంతా గర్వించేలా లోకమంతా కనిపించేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా బెజవాడ నడిబొడ్డున రూ.400 కోట్ల వ్యయంతో నిర్మించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి భారీ ఎత్తున తరలిరావాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు.
మైలవరం వ్యవసాయ మార్కెట్ యార్డులో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్మృతి వనం ప్రారంభోత్సవ పోస్టర్లను విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని), స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆవిష్కరించారు.
ఈ నెల 19న అనగా రేపు శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సామాజిక సమత సంకల్ప సభను నిర్వహించనున్నట్లు, అనంతరం 6 గంటల నుంచి 8 గంటల వరకు విజయవాడ స్వరాజ్యమైదానంలో ‘సామాజిక న్యాయ మహా శిల్పం’ పేరుతో నిర్మించిన 125 అడుగుల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అత్యంత ఎత్తైన విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించి జాతికి అంకితం చేయనున్నారు.
విగ్రహావిష్కరణతో పాటు అంబేద్కర్ స్మృతివనం ప్రారంభం ఉంటుంది. ఇందులో అంబేద్కర్ ఫోటో గ్యాలరీ, జీవిత విశేషాలు, శిల్పాలుంటాయి. ఓ కన్వెన్షన్ హాల్, ఫుడ్ కోర్టులు ఉంటాయి. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్‌గా ఈ విగ్రహం ప్రాచుర్యంలో రానుంది.
అంబేద్కర్ విగ్రహం ఎత్తు 125 అడుగులు కాగా పెడస్టల్ ఎత్తు 85 అడుగులుంటుంది. అంటే మొత్తం 210 అడుగుల ఎత్తులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఠీవిగా నిలబడనుంది.18.81 ఎకరాల్లో ఈ స్మృతివనం ఏర్పాటైంది. ఈ విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్దదైన అంబేద్కర్ విగ్రహం కాగా దేశంలోని అతి పెద్ద విగ్రహాల్లో మూడవది. ఈ కార్యక్రమానికి మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు భారీగా తరలిరావాలని కోరారు. రాజ్యాగ హక్కులకై నిలిచి అందరూ అంబేద్కర్ మార్గంలో నడుద్దామని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కోరారు.