సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
దళిత బంధు యూనిట్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునేలా అధికారులు పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి లోని సమావేశ మందిరంలో గ్రౌండింగ్ అయిన యూనిట్ల నిర్వహణ, యూనిట్ల రెండో విడత వాయిదా మంజూరు, గ్రౌండింగ్ అయిన యూనిట్ల నిర్వహణకు నైపుణ్య శిక్షణపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దళిత బంధు పైలట్ ప్రాజెక్ట్ క్రింద చేపట్టిన చింతకాని మండలంలో 3,462 మంది లబ్ధిదారులకు గాను 3,385 మంది లబ్ధిదారులకు యూనిట్ల గ్రౌండింగ్ పూర్తి చేసామన్నారు. యూనిట్ల నిర్వహణకు ఆయా శాఖలచే నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. యూనిట్లను స్వయంగా లబ్ధిదారులే నిర్వహించాలని, లీజుకు ఇవ్వడం తదితరాలతో అంతగా లాభం ఉండదని, పథక లక్ష్యం నెరవేరదని ఆయన అన్నారు. గ్రౌండింగ్ అయిన ప్రతి యూనిట్ పై ప్రత్యేక అధికారులు పర్యవేక్షణ చేయాలని, దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. లీజుకు ఇచ్చిన యూనిట్లను స్వాధీనం చేరుకోవాలని, లబ్ధిదారులకు అవగాహన కల్పించి, అవసరమైతే ఇంకనూ శిక్షణ ఇచ్చుటకు చర్యలు చేపట్టాలని అన్నారు. జేసిబి, అజాక్, హార్వెస్టర్ ల డ్రైవింగ్, నిర్వహణపై శిక్షణా కార్యక్రమం ఏర్పాటుచేయాలన్నారు. అధికారులు అద్దె వాహనాలు తీసుకునేప్పుడు, దళితబంధు యూనిట్ల క్రింద మంజూరైన వాహనాలకు ప్రాధాన్యత నివ్వాలన్నారు. వివిధ శాఖల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, కాంట్రాక్టర్లకు దళితబంధు క్రింద మంజూరైన జేసిబి యూనిట్ల జాబితా, వివరాలు ఇచ్చి, చేపట్టే పనుల్లో వినియోగించే విధంగా చూడాలన్నారు. కిరాణా షాపులు బిల్లుల నిర్వహణ సక్రమంగా చేపట్టాలన్నారు. పేపర్ ప్లేట్, గ్లాసుల యూనిట్లను ప్రోత్సాహించాలన్నారు. మొదటి యూనిట్ సక్రమ నిర్వహణ చేపట్టి, లాభదాయకంగా ఉండి, అభివృద్ధి చెందుతున్న వారికి రెండో యూనిట్ మంజూరు చేయాలన్నారు. ప్రత్యేక అధికారులు ఇంకనూ గ్రౌండింగ్ కు ఉన్న మిగులు యూనిట్లపై వ్యక్తిగత శ్రద్ధ పెట్టి పూర్తి చేయాలన్నారు. యూనిట్ల నిర్వహణపై సర్పంచులు, దళిత బంధు కమిటీని బాధ్యులను చేయాలని, దుర్వినియోగం చేసిన గ్రామంలో ఇకముందు యూనిట్ల మంజూరులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు.
ఈ సమీక్ష లో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, శిక్షణా సహాయ కలెక్టర్ రాధిక గుప్తా, డిఆర్వో శిరీష, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.