The attitude of the party leaders in the matter of baiting Terasa MLAs is like digging a hill and catching a rat.
దిల్లీ: ‘తెరాస ఎమ్మెల్యేలకు ఎర’ వ్యవహారంలో ఆ పార్టీ నేతల వైఖరి కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఈ కేసులో భాజపా నేతలపై సీఎం కేసీఆర్ ఆరోపణలు చేస్తూ వీడియోలు ప్రదర్శించిన నేపథ్యంలో కిషన్‌రెడ్డి స్పందించారు.
దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టే విధంగా వీడియోలో ఎక్కడా లేదని.. తెరాస ప్రభుత్వం అంత బలహీనంగా ఉందా? అని ప్రశ్నించారు.
ఆ కథ కేసీఆర్ ఊహాజనితం
‘‘కేసీఆర్ ఊహాజనితమైన ఆలోచన నుంచి పుట్టిందే ఈ కథ. స్వామీజీలతో ఎక్కడైనా ప్రభుత్వాలు కూలిపోతాయా? ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి నీతిమంతుడైనట్లు చెబుతున్నారు. తెలంగాణ రత్నాలని చెబుతున్న నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు ఏ పార్టీ నుంచి గెలిచారు? మీరా ప్రజాస్వామ్యం గురించి నీతులు వళ్లించేది?ప్రెస్మీట్లో కేసీఆర్ పాత రికార్డులనే మళ్లీ తిరగతోడారు.
తన అసహనం, ఆక్రోశం, అభద్రతా భావాన్ని మరోసారి ఆయన ఏకరువు పెట్టారు. తనకి తానే సీఎం పదవిని చులకన చేస్తూ మాట్లాడారు. బ్రోకర్ల ద్వారా నేతలను పార్టీలో చేర్పించుకునే అలవాటు మీకు ఉందేమో.. మాకు లేదు. నాలుగేళ్లుగా కేంద్రమంత్రిగా పనిచేస్తున్నా. తెలంగాణకు సంబంధించిన ఏ విషయమైనా పార్టీ అధిష్ఠానం మాతో సంప్రదిస్తుంది.
అందుకే జిమ్మిక్కు రాజకీయాలు..
తెరాస ప్రభుత్వం పడిపోవాలని మాకు లేదు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాం. కేసీఆర్ తర్వాత ఆయన కుమారుడు సీఎం కాలేరనే భయంతోనే ఇలా చిల్లర, జిమ్మిక్కు రాజకీయాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలను కొనాల్సిన ఖర్మ మాకు పట్టలేదు.
ప్రజాస్వామ్య బద్ధంగానే మేం అధికారంలోకి వస్తాం. నలుగురు ఆర్టిస్టులు కూర్చొని అందమైన అబద్ధాన్ని వీడియోల రూపంలో పెడితే తెలంగాణ ప్రజలు నమ్మేస్తారని అనుకుంటున్నారా?బయటి వ్యక్తితో బేరసారాలు జరపాల్సిన ఖర్మ మాకేంటి? రాష్ట్రంలోకి సీబీఐని రాకుండా అడ్డుకునేందుకు పాత తేదీలతో జీవో ఇచ్చారు.
ప్రత్యేక హోదా పేరుతో గతంలో తెదేపా ఏవిధంగా భాజపాపై బురదచల్లే ప్రయత్నం చేసిందో.. ఇప్పుడు కేసీఆర్ కూడా తమ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మాట్లాడుతున్నారు’’ అని కిషన్‌రెడ్డి విమర్శించారు.