చీరాల తెలుగుదేశం పార్టీలో అంతేనట…

Spread the love

చివరిదాకా అభ్యర్ధిపై క్లారిటీ ఉండదట..!

చీరాల
గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి జైకొట్టారు కరణం బలరాం. ఆయన ప్లేస్‌లో కొత్త ఇన్‌ఛార్జిని పార్టీ అధిష్ఠానం నియమించినా.. చినబాబు కోటా అంటూ మంగళగిరి నుంచి మరో నాయకుడు ల్యాండ్‌ అయ్యారు. నేనుండగా నువ్వెందుకు అంటున్నారు పార్టీ ఇన్‌ఛార్జి. ఈ ఇద్దరే కాకుండా మరో ముగ్గురు టికెట్‌ ప్రయత్నాల్లో ఉన్నారు. అసలే చీరాల సైకిల్‌ టైర్లలో గాలి అంతంతమాత్రం ఉంటే.. ఈ ఓవర్‌ లగేజ్‌ అవసరమా అంటోంది పార్టీ కేడర్‌. పార్టీ పెద్దల ప్రయోగాలతో చీరాలలో చీటీ చిరిగిపోద్దా ఏంది.. అంటూ తలపట్టుకుంటున్నారు తమ్ముళ్లు.

పెద్ద నాయకుడు సైడపోగానే రాబోయే కాలానికి కాబోయే ఎమ్మెల్యేలం అంటూ కొత్త నాయకులు పుట్టుకొస్తూనే ఉన్నారక్కడ. బాపట్ల జిల్లా పరిధిలోని చీరాల టీడీపీలో ఎన్నికలొచ్చిన ప్రతీసారీ పాతాకొత్త నేతల మధ్య ఆధిపత్య పోరు ఆనవాయితీగా మారిపోతోంది. సీటు కోసం సిగపట్లు పడుతున్నారు అక్కడి సైకిల్‌ పార్టీ నాయకులు. కరణం జెండా మార్చేయటంతో రెండేళ్ళ క్రితం ఇన్‌ఛార్జి బాధ్యతలు తీసుకుని పనిచేసుకుంటూ పోతున్నారు ఎంఎం కొండయ్య. ఎన్నికల ముందు కొందరు నేతలు టికెట్లు ఆశిస్తూ చీరాలలో హడావిడి చేస్తున్నారట. ఇప్పటికే కొండయ్యకు పోటీగా మంగళగిరి నుంచి చేనేత వర్గానికి చెందిన తిరువీధుల శ్రీనివాసరావు రంగంలోకి దిగారంటున్నారు. చీరాలలో తనకున్న బంధుగణం, సామాజిక వర్గాల నేతలతో పాటు టీడీపీ శ్రేణులతో కూడా సమావేశమవుతున్నారు తిరువీధుల.

ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న చీరాల ఇప్పుడు ఆ పార్టీకి పెద్ద సవాలుగా మారింది. టీడీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీ నుంచి పదవులు పొందిన నేతలంతా తర్వాత వైసీపీ గూటికి చేరారు. దీంతో చీరాలలో టీడీపీకి నాయకత్వ సమస్య తలెత్తింది. చీరాలలో టీడీపీ అభ్యర్ధి తొలిసారి 1985లో గెలుపొందారు. అప్పటి నుంచి 8 సార్లు ఎన్నికలు జరిగితే నాలుగుసార్లు టీడీపీదే విజయం. మూడుసార్లు కాంగ్రెస్, ఒకసారి నవోదయం పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. 2004 నుంచి వరుసగా మూడు ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ.. 2019లో చీరాలలో మళ్లీ జెండాపాతింది. చీరాల టీడీపీలో బలమైన అభ్యర్దులు లేకపోవడంతో గత ఎన్నికల్లో అద్దంకి నుంచి కరణం బలరాంని రంగంలోకి దించారు. ఎమ్మెల్యేగా గెలిచిన బలరాం ఏడాది తిరక్కుండానే పరోక్షంగా వైసీపీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. తన వారసుడు కరణం వెంకటేష్‌ను వైసీపీలో చేర్పించటంతో.. ఇప్పుడు కరణం కుమారుడే అక్కడ వైసీపీ అభ్యర్థి.

చీరాలలో బ్యాలెన్స్‌ తప్పిన సైకిల్‌ని రిపేరు చేసేందుకు బీసీ కాన్సెప్ట్‌తో యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యాపార వేత్త ఎంఎం కొండయ్యను రంగంలోకి దించింది టీడీపీ అధిష్ఠానం. రెండేళ్ల క్రితం పూర్తిస్థాయి ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించింది. అప్పటినుంచీ ఆయన ఎన్ని సర్వీసింగ్‌లు చేసినా సైకిల్‌ మాత్రం స్పీడందుకోలేదన్న అభిప్రాయంతో ఉందట అధిష్ఠానం. చీరాలలో చేనేతలు ఎక్కువగా ఉండటంతో ఆ సామాజికవర్గానికి చెందిన నాయకుడు అయితే గెలుపు అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారట పార్టీ పెద్దలు.

నారా లోకేష్‌ ఆశీస్సులు ఉన్నాయంటూ చేనేత సామాజిక వర్గానికి చెందిన మంగళగిరి బీసీ నేత తిరువీధుల శ్రీనివాసరావు చీరాలలో వాలిపోయారు. ఆయనకు పార్టీ అధినేతతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు. చేనేతవర్గం బలంగా ఉన్న మంగళగిరిలో లోకేష్ పోటీలో ఉండటంతో.. చీరాల టికెటిచ్చి బ్యాలెన్స్‌ చేయాలన్నది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోందట. 2019లో మంగళగిరిలో లోకేష్‌కి అండగా ఉన్న తిరువీధుల చీరాలకు కొత్తేం కాదంటున్నారు. నియోజకవర్గంలో ఆయనకు పరిచయాలు, బంధు గణం ఉండటంతో ఆయన అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తోందట పార్టీ అధిష్ఠానం.

చీరాల టీడీపీ టికెట్‌ కోసం నేతలు పోటీపడుతుండటంతో ఇన్‌ఛార్జి ఎంఎం కొండయ్య పరిస్థితి ఏంటనేది ఇంకా తేలలేదట. కొందరి ప్రయత్నాలు చూస్తుంటే తనకు టికెట్‌ వస్తుందో రాదోనన్న సందేహంతో ఉన్నారట కొండయ్య. దీంతో అసలే పార్టీ కష్టాల్లో ఉంటే ఇప్పుడు ఈ టికెట్‌ రేసు పెట్టి ఎటూ తేల్చకుండా కాలయాపన చేస్తే మొదటికే మోసం వస్తుందని టెన్షన్‌ పడిపోతోంది చీరాల టీడీపీ కేడర్‌. 34మందితో ప్రకటించిన సెకండ్‌ లిస్టులో కూడా చీరాల ప్రస్తావన లేకపోవటంతో ఇక ఫైనల్‌ లిస్ట్‌లోనే క్లారిటీ వచ్చేలా ఉంది. మీ సమీకరణాల సంగతేమోగానీ త్వరగా అభ్యర్థిపై క్లారిటీ ఇస్తే జనంలోకెళ్తాం మహాప్రభో అంటూ అధిష్ఠానానికి మొరపెట్టుకుంటోంది చీరాల సైకిల్ పార్టీ కేడర్‌.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Related Posts

You cannot copy content of this page