SAKSHITHA NEWS

కేసీఆర్‌ హయాంలో పదిరెట్లు పెరిగిన పెన్షన్లు: మంత్రి కేటీఆర్‌
సాక్షిత హైదరాబాద్‌: ఏ రాష్ట్రంలో లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అమ్మ ఒడి లాంటి పథకం ఎక్కడా లేదని చెప్పారు. రాఖీపౌర్ణమి సందర్భంగా వివిధ పథకాల లబ్ధిదారులతో మంత్రి కేటీఆర్‌ జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేశామని వెల్లడించారు. ఇప్పటివరకు 13.30 లక్షల మందికి కేసీఆర్‌ కిట్లు అందజేశామన్నారు. మగపిల్లలు పుడితే రూ.12 వేలు, ఆడ పిల్లలు పుడితే రూ.13 వేలు ఇస్తున్నామని తెలిపారు. అనవసర సిజేరియన్లు తగ్గించి సహజ ప్రసవాలు పెంచాలని సంకల్పించామన్నారు. సహజ ప్రసవం చేయించే వైద్య సిబ్బందికి రూ.3 వేల ప్రోత్సాహకం ఇస్తున్నామని చెప్పారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కావద్దని కల్యాణలక్ష్మి తీసుకొచ్చామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 19 లక్షల మంది తల్లులకు ప్రభుత్వం పౌష్టికాహారం అందిస్తున్నదని చెప్పారు. అంగన్‌వాడీ కార్యకర్తల జీతాల్లో కేంద్రం కోటా తగ్గించిందని, అయినప్పటికీ అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తల జీతాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచిందన్నారు.
కంటి వెలుగు ద్వారా బాధితులకు వైద్యం అందించామని వెల్లడించారు. ఏజెన్సీ ఏరియాల్లోని ప్రజల ఆరోగ్య పరిస్థితి కోసం ప్రత్యేక వైద్య పరీక్షలు చేయించామని, దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు వైద్య పరీక్షలు చేయిస్తామన్నారు. రాష్ట్ర ప్రజలందరి హెల్త్‌ ప్రొఫైల్‌ సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెంచామన్నారు. 33 జిల్లాల్లో 33 వైద్య కళాశాలల ద్వారా పేదలకు వైద్యం అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు.

మిషన్‌ భగీరథ వల్ల మంచినీళ్ల సమస్య పూర్తిగా తీరిందని చెప్పారు. ఫ్లోరోసిస్‌ మహమ్మారిని తరికొట్టామన్నారు. ఇప్పుడు హర్‌ ఘర్‌ జల్‌ పేరుతో కేంద్రం ఏదో ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ హయాంలో పెన్షన్‌ పదిరెట్లు పెరిగిందని చెప్పారు. నాలుగు లక్షల మంది మహిళా బీడీ కార్మికులకు పెన్షన్‌ ఇస్తున్నామని చెప్పారు. 14 లక్ష మంది ఒంటరి, వితంతు మహిళలకు పెన్షన్‌ ఇస్తున్నామన్నారు. ఆగస్టు 15 నుంచి మరో 10 లక్షల మంది కొత్తవాళ్లకు పెన్షన్లు ఇవ్వనున్నామని తెలిపారు.

స్థానిక సంస్థలు, నామినేటెడ్‌ పదవుల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇస్తున్నామని వెల్లడించారు. చట్ట సభల్లో కూడా మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రాన్ని కోరామన్నారు. తెలంగాణ ఆడబిడ్డలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు..


SAKSHITHA NEWS