SAKSHITHA NEWS

Telangana government is good news for women

తెలంగాణ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను అనుసరించి రాష్ట్రంలో ‘మహిళా శక్తి – క్యాంటీన్ సర్వీస్’ లను ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడించారు.
రాష్ట్రంలో క్యాంటీన్ సర్వీస్ ల ఏర్పాటుపై నేడు సచివాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా సి.ఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ… రాష్ట్రంలో మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని ప్రధాన కార్యాలయాలు, కలెక్టరేట్లు, పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, బస్ స్టాండ్ లు, పారిశ్రామిక ప్రాంతాలలో మహిళా సంఘాల నిర్వహణలో ప్రత్యేకంగా క్యాంటీన్ లను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.

ఇప్పటికే, “అన్న” క్యాంటీన్ల పేరుతో కేరళలో, దీదీ కా రసోయ్ అనే పేరుతో బెంగాల్ లో నడుస్తున్న క్యాంటీన్ ల పనితీరుపై అధ్యయనం చేసినట్లు వివరించారు. రానున్న రెండేళ్లలో కనీసం 150 క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. ఈ క్యాంటీన్ ల నిర్వహణను గ్రామైక్య సంఘాలకు అప్పగించనున్నట్టు తెలిపారు. క్యాంటీన్ నిర్వహణపై ఈ సంఘాలకు ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వనున్నట్టు శాంతికుమారి చెప్పారు.

ఈ క్యాంటీన్ ల పనితీరు, నిర్వహణ, వీటి ఏర్పాటుకు ఎంత విస్తీర్ణంలో స్థలం అవసరం, వీటి ఏర్పాటుకు రోడ్ మ్యాప్ తదితర అంశాలపై సవివరంగా ప్రణాళికను రూపొందించాల్సింగా గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ కమీషనర్ ను సి.ఎస్ ఆదేశించారు. భేటీలో రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్ అనిత రామచంద్రన్, ఆరోగ్య శాఖ కమీషనర్ కర్ణన్, దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమీషనర్ హనుమంత రావు, టూరిజం శాఖ డైరెక్టర్ నిఖిల, టూరిజం కార్పొరేషన్ ఎండీ రమేష్ నాయుడు, తదితరులు హాజరయ్యారు.

WhatsApp Image 2024 06 14 at 09.39.28

SAKSHITHA NEWS