సింగరేణికి తాడిచర్ల–2 బొగ్గు గని గొప్ప వరం…..
ఏడాదికి 60 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం – 45 ఏళ్లపాటు ఉత్పత్తికి అవకాశం….
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి. హైదరాబాద్, సింగరేణి సంస్థకు కొత్త గనుల అవసరం అత్యంత కీలకంగా ఉన్న సమయంలో తాడిచర్ల–2 బొగ్గు గనికి తవ్వకాల లీజు అనుమతులు లభించడం సంస్థకు గొప్ప వరమని సింగరేణి జనరల్ మేనేజర్ (సమన్వయం, మార్కెటింగ్) టి. శ్రీనివాస్ అన్నారు.
హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో నిర్వహించిన తాడిచర్ల–2 బొగ్గు గని సాధన విజయోత్సవ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం పాత గనులు క్రమంగా మూతపడుతున్న నేపథ్యంలో కొత్త గనులను ప్రారంభించడం అత్యవసరమని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో గత ఏడాది నైనీ బొగ్గు గనికి అన్ని అనుమతులు సాధించి ఉత్పత్తి ప్రారంభించామని, తాజాగా తాడిచర్ల–2 గనికి కూడా తవ్వకాల లీజు లభించడంతో త్వరలోనే ఉత్పత్తి ప్రారంభించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు.
సింగరేణి పరిధిలోని ఇతర బొగ్గు గనులు కూడా సంస్థకు వచ్చేలా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, కొత్త గనుల రాకతో సింగరేణి పూర్వ వైభవాన్ని తిరిగి సొంతం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాడిచర్ల–2 గని నుంచి ప్రతి ఏడాది కనీసం 60 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని, సుమారు 45 సంవత్సరాల పాటు ఈ గనిలో ఉత్పత్తి కొనసాగుతుందని వివరించారు.
ఈ గనికి సంబంధించిన ప్రక్రియలో ప్రత్యేక చొరవ చూపిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క, అలాగే తవ్వకాల లీజు అనుమతులు మంజూరు చేసిన కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సమావేశంలో సింగరేణి భవన్‌లోని వివిధ విభాగాలకు చెందిన అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
