ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రజల విశ్వాసం పెరిగింది.. రూ.131 కోట్ల విలువైన వైద్య సేవలు….
— విప్ చింతకుంట విజయరమణరావు…
పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: పెద్దపల్లి, పెద్దపల్లి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.131 కోట్లకు పైగా విలువైన వైద్య సేవలు పేద ప్రజలకు అందించామని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు తెలిపారు.
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఆయన ప్రతి వార్డును పరిశీలించి, రోగులను కలిసి వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఆసుపత్రిలో రూ.40 లక్షల వ్యయంతో కంటి, దంత, చెవి–ముక్కు–గొంతు, చర్మ, ఆర్థోపెడిక్ తదితర విభాగాలకు అత్యాధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. నవజాత శిశువుల చికిత్స విభాగాన్ని ఆధునీకరించి వార్మర్లు, ఫోటోథెరపీ యూనిట్లు, సీప్యాప్, వెంటిలేటర్ ఏర్పాటు చేయడంతో వందలాది శిశువులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు.
గత రెండేళ్లలో 2,081 ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సలు, 6,478 జనరల్ సర్జరీలు, 3,096 కంటి శుక్లాల శస్త్రచికిత్సలు, వేల సంఖ్యలో వివిధ రకాల నిర్ధారణ పరీక్షలు, 5,067 ప్రసవాలు విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించారు. అలాగే లక్షలాది మంది బయటి రోగులకు ఉచితంగా మందులు అందించినట్లు తెలిపారు.
ఈ రెండేళ్లలో ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా మొత్తం రూ.131.62 కోట్ల విలువైన వైద్య సేవలు పేద ప్రజలకు అందించామని పేర్కొన్నారు. గతంలో వైద్య సదుపాయాల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు, ప్రస్తుతం నాణ్యమైన సేవలతో ప్రభుత్వ ఆసుపత్రినే ఆశ్రయిస్తున్నారని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జిల్లా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహకారంతో ఆసుపత్రి అభివృద్ధి వేగంగా జరుగుతోందన్నారు. రూ.51 కోట్లకు పైగా వ్యయంతో ప్రస్తుతం ఉన్న 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆధునిక ఆసుపత్రిగా విస్తరిస్తున్నామని, నిర్మాణ పనులు పూర్తయిన అనంతరం ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
తెలంగాణలోని 33 జిల్లాల్లో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఉత్తమ సేవలు అందించే ఆసుపత్రిగా గుర్తింపు పొందడం గర్వకారణమని పేర్కొంటూ, ఇందుకు కృషి చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యులు, సిబ్బందిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
