రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రైతులు అప్రమత్తంగా ఉండాలి…..
— కలెక్టర్ కోయ శ్రీహర్ష…
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: పెద్దపల్లి, వాతావరణ నిపుణులు, క్లైమటాలజిస్టులు అందించిన నివేదికల ప్రకారం పెద్దపల్లి జిల్లాలో జూలై 28, 29 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు.
విడుదల చేసిన ప్రకటనలో కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు విత్తనాలు వేసేందుకు అత్యంత అనుకూల సమయమని పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు.
ముఖ్యంగా కంది, పెసర, నువ్వులు, పొద్దుతిరుగుడు, అలసంద, కూరగాయలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాల సాగు చేపడితే మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంటుందని తెలిపారు.
సకాలంలో విత్తనాలు వేయడం వల్ల నేలలో తగినంత తేమ లభించి పంటలు ఆరోగ్యంగా ఎదిగి అధిక దిగుబడులు వచ్చే అవకాశాలు మెరుగుపడతాయని కలెక్టర్ పేర్కొన్నారు.
వ్యవసాయ శాఖ అధికారులు గ్రామస్థాయిలో రైతులకు అందుబాటులో ఉండి ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన సాంకేతిక సూచనలు అందించాలని ఆదేశించారు.
ఆగస్టు 10 వరకు మోస్తరు వర్షాలు కురిసినప్పటికీ చెరువులు నిండడం, భూగర్భ జలాలు గణనీయంగా పెరగడం కష్టమని, ఈ పరిస్థితుల్లో వరి వంటి అధిక నీటి అవసరమున్న పంటల కంటే ఆరుతడి పంటల సాగుకే రైతులు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనలను పాటిస్తూ అనుకూల వర్షాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రైతులకు పిలుపునిచ్చారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
