కనీస వేతనాలు నెలకు రూ.26 వేలకు పెంచాలి…
రామగుండంలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి వెంటనే నిర్మించాలి…
కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి సీఐటీయూ వినతిపత్రం…
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి. గోదావరిఖని, కేంద్ర ప్రభుత్వం 2022 నుంచి పెండింగ్‌లో ఉన్న కనీస వేతనాల ప్రభుత్వ ఉత్తర్వులను వెంటనే సవరించి, నెలకు కనీస వేతనాన్ని రూ.26 వేలకు తగ్గకుండా నిర్ణయించాలని, అలాగే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రిని తక్షణమే నిర్మించాలని సీఐటీయూ పెద్దపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేసింది.
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సింగరేణి పర్యటన సందర్భంగా గోదావరిఖని ఓసీపీ–5 వద్ద సీఐటీయూ ప్రతినిధి బృందం వినతిపత్రాన్ని అందజేసింది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్. బిక్షపతి మాట్లాడుతూ, సింగరేణి, ఎన్‌టీపీసీ, రామగుండం ఎరువుల కర్మాగారం, బసంత్‌నగర్ సిమెంట్ పరిశ్రమ, రైల్వే, చమురు తదితర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న సుమారు 25 వేల మంది కాంట్రాక్టు కార్మికులు కనీస వేతనాల సవరణ లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
నిత్యావసర వస్తువుల ధరలు నిరంతరం పెరుగుతున్నప్పటికీ, వాటికి అనుగుణంగా కార్మికుల వేతనాలను పెంచడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విమర్శించారు. కనీస వేతనాల చట్టం ప్రకారం ప్రతి ఐదేళ్లకు ఒకసారి వేతనాలను సవరించాల్సి ఉండగా, 2017లో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల గడువు 2022 జనవరిలోనే ముగిసిందని గుర్తు చేశారు. నాలుగేళ్లకు పైగా గడిచినా కొత్త ఉత్తర్వులు జారీ చేయకపోవడం వల్ల వేలాది మంది కార్మికులు నష్టపోతున్నారని పేర్కొన్నారు.
కార్మికుల భవిష్యనిధి, ఉద్యోగుల రాష్ట్ర బీమా, బోనస్‌లపై ఉన్న పరిమితులను ఎత్తివేసి పూర్తి ప్రయోజనాలు కల్పించాలని, కాంట్రాక్టు కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. అలాగే కార్మికులకు నష్టం కలిగించే విధంగా ఉన్న కార్మిక చట్టాల మార్పులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఈఎస్ఐ పరిధిలో ఉన్న సుమారు 25 వేల కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందేలా 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రిని వెంటనే నిర్మించాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి, జిల్లా అధ్యక్షుడు వేల్పుల కుమారస్వామి, జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్. బిక్షపతి, జిల్లా కోశాధికారి ఎం. రామాచారి, జిల్లా కమిటీ సభ్యులు గీట్ల లక్ష్మారెడ్డి, ఎం.డి. యాకుబ్, ఆరేపల్లి రాజమౌళి, గౌస్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
