SAKSHITHA NEWS

చాలీచాలని జీతంతో – కుటుంబ పోషణ బరువై

— మా కష్టాన్ని గుర్తించడం లేదు

— గ్రేడింగ్ విధానంతో మా పొట్ట కొడుతున్నారు

— కనీస వేతనం 26వేలు, ఉద్యోగ భద్రత కల్పించాలి – వి ఓ ఏ లు

— సమస్యల పరిష్కారానికి రోడ్డెక్కిన వివోఏలు

— వివోఏ ల పరిస్థితి పై ప్రత్యేక కథనం

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)

కనీస వేతనం ఇవ్వకపోయినా పనిచేసినం ప్రభుత్వ పథకాలు మహిళా సంఘాల ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు కృషిచేసినం సర్వేలు చేసినం బిఆర్ ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 3900 గౌరవ వేతనం ఇస్తే సరిపెట్టుకుంటూ వస్తున్నం చాలీచాలని వేతనాలతో ఇంకా ఎన్ని రోజులు ఈ వ్యక్తి చాకిరి చేయాలి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఐకెపి విఓఏ లు. ఐకెపి విఓఏ లు చేస్తున్న నిరసన ధర్నాపై ప్రత్యేక కథనం. ఐకెపి ఉద్యోగులు అనగానే ముందుగా గుర్తొచ్చేది వివోఏలు. గ్రామాలలో పట్టణాలలో మహిళలని చైతన్యపరుస్తు గ్రూపులుగా ఏర్పాటు చేసి వారికి బ్యాంక్ ఋణాలు ఇప్పించి వారిలో మార్పు తీసుకువస్తున్నారు. మొదటి నుండి వారికి జీతభత్యాలు లేవు. సంఘాలకు లోన్లు ఇప్పించడం నెల నెలా బ్యాంక్ లో ఋణాలు కట్టేలా వారిని సమావేశ పరచడం సంఘం పుస్తకాలు రాయడం, బ్యాంకు లింకేజీ, శ్రీనిధి, సంఘాలకు అందాల్సిన ప్రభుత్వ పథకాలను అందేలా చూడడం, ప్రభుత్వ సర్వేలు చేయడం ఇలా చేస్తూ సంఘానికి ఎంతో కొంత డబ్బులు తీసుకుంటూ జీవితాలని వెళ్లదీస్తూ వస్తున్నారు. ఖర్చులు పెరుగుతున్న కూడా సంఘాల నుండి ఎక్కువ డబ్బులు తీసుకునేవారు కాదు కానీ ఓపిక నశించి బ్రతుకు బారం అయి ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. ఈ వివో ఏల వ్యవస్థ వచ్చిన తర్వాతనే గ్రామీణ మహిళలకు రుణాలు అందించడం సులభం అయింది. ప్రభుత్వ పథకాలను సైతం సంఘాలకు అందేలా చూడడం ఇందులో ముఖ్యమైన విషయం. సుమారు వివోఏలు రాష్ట్రంలో 18వేల పైచిలుకు ఉంటారు. ఒక వివో ఏ పరిధిలో దాదాపు 25 సంఘాలు ఉంటాయి. ఒక సంఘాన్ని సమావేశపరిచి తీసుకున్న రుణాలు సరైన సమయాల్లో చెల్లించేలా చేసినందుకు 50 రూపాయలు చెల్లించేవారు. అంటే 25 సంఘాల పేరుమీద ఒక వివోఏ కు నెలకు సుమారు 2వేల రూపాయలు వచ్చేవి. రెండువేలతో కుటుంబ అవసరాలని సర్దుకుంటూ వస్తున్నారు. రాను రాను ఖర్చులు పెరుగుతున్నాయి సంఘాల నుంచి ఇచ్చే డబ్బులు సరిపోక కనీస వేతనం ఇవ్వాలని కొట్లాడితే బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వివో ఏ లకు గౌరవ వేతనంగా 3000 అలాగే కరోనా సమయంలో పిఆర్ సి కింద 900 మొత్తం కలిపి 3900 నెలకు వస్తున్నాయి. ఇచ్చే 3900 కూడా గ్రేడింగ్ విధానంలో ఇస్తున్నారు. ఈ గ్రేడింగ్ విధానం వల్ల కొన్ని నెలల జీతాలు నష్టపోవాల్సి వస్తుందన కొంతమంది వివోఎల ఆవేదన. ఇన్ని రోజులు ఇచ్చిన వేతనాన్ని సరిపెట్టుకుంటూ వస్తున్నామని ఇక సరిపెట్టుకునే పరిస్థితుల్లో లేమని రాష్ట్రవ్యాప్తంగా ధర్నాకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు గత పది రోజుల నుండి వివిధ కోణాల్లో నిరసన తెలుపుతూ ధర్నా నిర్వహిస్తున్నారు.
వివోఏ లను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని కనీస వేతనం 26వేలు ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పిస్తూ వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని, సేర్ఫ్ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఐడి కార్డులను జారీ చేయాలని, గ్రేడింగ్ విధానంతో సంబంధం లేకుండా వివో ఏల వ్యక్తిగత ఖాతాలో జీతం డబ్బులను జమ చేయాలని పలు డిమాండ్లతో నిరసన ధర్నా చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు, సీపీఎం, కాంగ్రెస్, బిఎస్పీ, సీపీఐ, టిడిపి ఇలా అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతిస్తు వివో ఏల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం వివో ఏల సమస్యలను గుర్తించి పరిష్కరిస్తుందా లేదా చూడాలి మరి.

చాలీచాలని వేతనాలతో కుటుంబ పోశణ కష్టంగా మారుతుంది. మహిళలను చైతన్య పరుస్తూ సంఘాలకు రుణాలు ఇప్పిస్తూ వారు ఆర్థికంగా నిలతొప్పుకునేలా దోహదపడ్డాం. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి చేరేలా తమ వంతు కృషి చేశాము. ప్రభుత్వం వివోఏల పట్ల చిన్నచూపు చూడడం తగదు. మా డిమాండ్లను పరిష్కరించి కనీస వేతనం ఇచ్చి గుర్తించాలి.

ఎదుల్ల లక్ష్మి . అధ్యక్షురాలు
విఓ ఏ కమిటీ చిట్యాల మండలం….

3900 వేతనం కాదు నెలకి 26వేల వేతనం, సేర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలి, గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేసి మా డిమాండ్లను పరిష్కరించి వెట్టి చాకిరి నుండి విముక్తి కల్పించాలి.

గుడిసె సువర్ణ. ప్రధాన కార్యదర్శి
విఓ ఏ కమిటీ చిట్యాల మండలం…


SAKSHITHA NEWS