ఏకాగ్రతతో చదివి సాధించి ఐఐటి నీట్ లో సీట్లు సంపాదించాలి
ఐటీడీఏ, భద్రాచలం ప్రాజెక్టు అధికారి బి. రాహుల్
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత
గిరిజన సంక్షేమ గురుకులం ఆధ్వర్యంలో నడపబడుతున్న స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు ఇంటర్మీడియట్ లో ఏకాగ్రతతో చదివి సాధించి ఐఐటి నీట్ లో సీట్లు సంపాదించాలని ఐటీడీఏ, భద్రాచలం ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. మంగళవారం రాత్రి రఘునాథపల్లిలోని స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ కళాశాలను పీవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాల తరగతి గదులు, డార్మెటరీ, పరిసరాలు, డైనింగ్ హాల్ ను పరిశీలించిన అనంతరం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమై కళాశాలలో అందుతున్న వసతి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఫ్యాకల్టీలు విద్యార్థులకు గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల బోధన తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలో సీనియర్ ఫ్యాకల్టీలు లేనందున గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు సరిగా అర్థం కావడం లేదని అలాగే మెనూ ప్రకారం సరియైన భోజనం అందడం లేదని విద్యార్థుల ద్వారా తెలుసుకోవడం జరిగిందని ఆయన అన్నారు.
తప్పనిసరిగా సీనియర్ ఫ్యాకల్టీలను నియమించాలని, మెనూ ప్రకారం భోజనము సమయానుకూలంగా అందించాలని, సీజనల్ ప్రకారం దొరికే పండ్లు ఫలాలు తప్పనిసరిగా విద్యార్థులకు అందించాలని ప్రిన్సిపాల్ కు ఆదేశించారు. విద్యార్థులు ఎవరూ బయటికి వెళ్లకుండా చూడవలసిన బాధ్యత ప్రిన్సిపాల్ పై ఉందని, వరదలు ఎక్కువ శాతం వస్తున్నందున పిల్లలు ఎవరు వాగులు, కెనాల్ వైపు వెళ్ళకుండా చూడాలని, తప్పనిసరిగా విద్యార్థులకు రాత్రిపూట స్టడీ అవర్స్ ఏర్పాటుచేసి ప్రత్యేకించి సీనియర్ ఫ్యాకల్టీని అందుబాటులో ఉంచాలని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న గురుకుల కళాశాల, స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ కళాశాలలపై ఆర్ సి ఓ ప్రత్యేక దృష్టి పెట్టి విద్యార్థులు బాగా చదివేల ఫ్యాకల్టీలకు సూచనలు, సలహాలు ఇచ్చి తప్పనిసరిగా జేఈఈ, ఐఐటి, నీట్ లలో మంచి ర్యాంకులు సాధించి వేరే స్టేట్లో ఉన్న కళాశాలలో సీట్లు సంపాదించేలా కృషి చేయాలని గురుకులం ఆర్సిఓ నాగార్జునరావు కు సూచించారు. సీనియర్ ఫ్యాకల్టీలను త్వరలో నియమిస్తామని విద్యార్థులకు తెలుపుతూ గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు ఇంగ్లీష్ సబ్జెక్టుపై కూడా ప్రత్యేక దృష్టి సారించి ఫ్యాకల్టీలు అందిస్తున్న సలహాలు, సూచనలు విద్యార్థులు అర్థం చేసుకొని మంచిర్యాంకులు సాధించాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ బాలస్వామి, సింగరేణి కళాశాల ప్రిన్సిపాల్ హరికృష్ణ, ఏవో కృష్ణ మరియు ఫ్యాకల్టీలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.