Stray ration mafia
విచ్చలవిడిగా రేషన్ మాఫియా
ఎన్టీఆర్ జిల్లా
మైలవరం నియోజకవర్గం
ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడి గ్రామంలో అడ్డగోలుగా పట్టపగలు రేషన్ మాఫియా రెచ్చిపోతోంది.ఇంటింటికీ తిరిగి రేషన్ బియ్యాన్ని కొనుగొలు చేసి స్థానిక గ్రామాలలో ఉన్న కోళ్లఫారాలకు తరలిస్తూ అక్రమ సంపాదనకు అలవాటు పడిన కొందరు కేటుగాళ్లు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. అడ్డదారులలో సంపాదనకు అలవాటు పడి ప్రభుత్వ వ్యవస్థలను సైతం బురిడీ కొట్టించి పగలు రాత్రి తేడా లేకుండా రేషన్ బియ్యాన్ని అడ్డదారుల్లో దళారులకు అందిస్తున్నారు. పట్టపగలే రేషన్ మాఫియా ఇంతలా రెచ్చిపోతున్నా కూడా ఆ గ్రామ రెవిన్యూ అధికారికి మాత్రం తెలియనట్లుగా వ్యవహరించడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటో అంటూ కొందరు గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.అసలు విషయం ఏమిటంటే ఆ గ్రామ పరిధిలోని రెవెన్యూ అధికారి గత కొంతకాలంగా ఉన్నా లేనట్లే వ్యవహరించడంతో కొటికలపూడి గ్రామంలో అక్రమ రేషన్ దందా కూడా అధిక మొత్తంలో జరుగుతోందని, ఒక వేళ ఎవరైనా ఈ గ్రామంలో జరిగే అక్రమ దందాలపై సమాచారం ఇచ్చినా కూడా సంభందితశాఖలు నుండి స్పందన కూడా ఉండదని విశ్వసనీయ సమాచారం.కొటికలపూడి గ్రామంలో జరుగుతున్న దందాలపై ఎవరైనా ప్రశ్నిస్తే ఎంతోకొంత ముట్ట చెబుతాం ఇక్కడనుండి తక్షణమే వెళ్ళిపోవాలి అంటూ హుకుం జారీ చేయడం ఈ గ్రామ పరిధిలో అక్రమాలకు పాల్పడుతున్నటువంటి వారి ప్రత్యేకత.
దొరికితే ముడుపుల మాయాజాలం
కొటికలపూడి గ్రామంలో జరుగుతున్న రేషన్ మాఫియా పై సమాచారం అందుకున్న అధికారులు కానీ మీడియా ప్రతినిధులు కానీ ఆ ప్రాంతానికి వెళితే వెంటనే ఎంతో కొంత ముట్టజెప్పి అక్కడ నుండి పంపించేయడం లేనిపక్షంలో వారిపై అక్రమ కేసులు బనాయించి ముప్పతిప్పలు పెడతామని బ్లాక్ మెయిల్ చేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. వారిచ్చిన ఆఫర్ కి ఒప్పుకుంటే సరే సరి లేదంటే అక్రమ కేసులు ఎదుర్కోవాలి లేదా వారి నుండి దాడులను ఎదుర్కోవాలి అందుకనే ఎవరూ కూడా వేరిని ఆపగలిగే ప్రయత్నం కూడా చేయడం లేదని కొందరు గ్రామస్తుల వాదన. ఇప్పటికైనా రెవెన్యూ వ్యవస్థ మొద్దు నిద్ర వీడి కొటికలపూడి గ్రామంలో జరుగుతున్న అక్రమ రేషన్ మాఫియా పై ఉక్కు పాదం మోపి సంబంధిత అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు