నగర సంకీర్తనతో ఆధ్యాత్మిక పరిమళాలు
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: ప్రపంచస్థాయి పవిత్ర పుణ్య క్షేత్రమైన తిరుపతి నగరం ప్రతి ఉదయం భక్తి తరంగాలతో మేల్కొంటోంది. శ్రీ వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహం నగరమంతా విరజిల్లాలనే సంకల్పంతో స్థానిక భజన మండలి సభ్యులు ఘనంగా నగర సంకీర్తనను నిర్వహిస్తున్నారు. శ్రీవారికి ప్రీతిపాత్రమైన శనివారం రోజు వందలాది మంది భక్తులు పాల్గొంటూ తిరుపతి వీధులను గోవింద నామస్మరణతో మారుమోగిస్తున్నారు.
అందులో భాగంగానే ఈ శనివారం కూడా తెల్లవారు జామున 5 గంటలకే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించి, నుదుటిపై గోవింద నామాలతో గోవిందరాజ స్వామి గుడి వద్దకు చేరుకుంటారు. అక్కడ నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య నగర సంకీర్తన ప్రారంభమవుతుంది. “గోవింద… గోవింద…” అనే నామస్మరణతో మారుమోగే వీధులు తిరుపతి నగరాన్ని ఆధ్యాత్మిక వాతావరణంతో నింపుతున్నాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు భక్తులు ఉత్సాహంగా పాల్గొంటూ భక్తి పరవశంలో మునిగిపోతున్నారు. ఈ నగర సంకీర్తన ద్వారా ప్రతి ఇంటిలోనూ భక్తి భావాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో మండలి సభ్యులు సేవాభావంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
సంకీర్తన ముగిసిన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేసి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ముగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు నాగేశ్వర్ రెడ్డి, గుండాల గోపీనాథ్, కోటి మునికృష్ణ, మునెప్ప గారి మునినాథరెడ్డి , నాగరాజు, వాసుదేవ రెడ్డి, పద్మనాభం, నరసింహారెడ్డి, ధనంజయ రెడ్డి, లోక ప్రభాకర్ నాయుడు, మిట్టపల్లి బ్రహ్మానందం, మురళి, తొండమునాటి సుబ్రహ్మణ్యం, మధు, కన్నప్ప గారి కేశవులు, పొన్నాల జేజిరెడ్డి, పద్మావతి, ఉష, సిద్ధమ్మ, అరుణ, జయమ్మ, పార్వతి, మునేంద్ర, కల్పన, విగ్రహాల కళ్యాణి, సిద్ధమ్మ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తి, ఐక్యత, సేవా భావాల సమ్మేళనంగా కొనసాగుతున్న ఈ నగర సంకీర్తన తిరుపతి నగర ఆధ్యాత్మిక మహిమను మరింతగా చాటుతోంది.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY