వెంకటగిరి నియోజకవర్గంలో విస్తృతంగా శిష్ట్లా ఎన్నికల ప్రచారం
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకుంటాం
తూర్పు రాయలసీమలో టీడీపీకి అనూహ్య స్పందన
కంచర్లకు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి
టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్
వెంకటగిరి, మార్చి 2: తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా వెంకటగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్ గురువారం విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వెంకటగిరి నియోజకవర్గం పరిధిలోని గోనపల్లి, తెగచర్ల తదితర గ్రామాల్లో టీడీపీ ముఖ్యనేతలతో కలిసి శిష్ట్లా లోహిత్ పర్యటించారు. పట్టభద్రులను కలిసి తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ కు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెల్పించాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే ఉపాధ్యాయులు, నిరుద్యోగ పట్టభద్రులు, ఉద్యోగులను కలుస్తూ తనదైన శైలిలో ప్రసంగాలు చేస్తూ ఆకట్టుకున్నారు. అనంతరం శిష్ట్లా లోహిత్ మాట్లాడుతూ తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పారు. తూర్పు రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి అనూహ్య స్పందన వస్తోందన్నారు. టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ కు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేయాలని పట్టభద్రులను కలిసి అభ్యర్థిస్తున్నామన్నారు. ఈ ఎన్నికల్లో కంచర్ల శ్రీకాంత్ ఖచ్చితంగా భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని చెప్పారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తనను వెంకటగిరి నియోజకవర్గానికి పరిశీలకునిగా నియమించడం జరిగిందన్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకు నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా పట్టభద్రులంతా ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీకి మద్దతిస్తామని బహిరంగంగా ప్రకటిస్తున్నారన్నారు. రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి పాలనపై తీవ్ర వ్యతిరేకత కన్పిస్తోందన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలంతా వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయనున్నారని తెలిపారు. ఈ ఎన్నికల విజయంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పతనానికి తెలుగుదేశం పార్టీ నాంది పలకనుందని చెప్పారు.
రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా 1వ తేదీన జీతాలను చెల్లించడం లేదన్నారు. దీనివల్ల ఉద్యోగులు సకాలంలో ఈఎంఐలు చెల్లించలేకపోతున్నారన్నారు.
రాష్ట్రానికి కొత్తగా ఎటువంటి పరిశ్రమలు రావడం లేదన్నారు. ఉన్న పరిశ్రమలు కూడా ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగ పట్టభద్రులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులంతా టీడీపీ బలపర్చిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ ను గెల్పిస్తే అందరి గళాన్ని శాసనమండలిలో వినిపించే అవకాశం ఉంటుందని శిష్ట్లా లోహిత్ విజ్ఞప్తి చేశారు.