సార్ .. ఇప్పుడైనా బయటకు వస్తారా?
తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో మంట రేగింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చీర గాజులు పంపిస్తానని వ్యాఖ్యాంచిన కౌశిక్ రెడ్డి… కాంగ్రెస్ లో చేరలేదన్న అరికపూడి గాంధీ ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ కండువా కప్పుతానని చేసిన వ్యాఖ్యలు అగ్గి రాజేశాయి. నువ్వొచ్చేదేంటి నేనే మీ ఇంటికి వస్తానని అరికపూడి గాంధీ…కౌశిక్ రెడ్డి నివాసానికి అనుచరులతో వెళ్లడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కౌశిక్ రెడ్డి నివాసానికి ఇంటి సమీపంలోనే అరికపూడి గాంధీని పోలిసులు అడ్డుకోవడంతో ఆయన అనుచరులు కొంతమంది ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలోనే కౌశిక్ రెడ్డి అనుచరులు – అరికపూడి అనుచరుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తీవ్ర కోపోద్రిక్తులైన కొంతమంది కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేయడంతో అద్దాలు పగిలాయి..పూల కుండీలు ధ్వంసం అయ్యాయి. విషయం సీరియస్ గా మారడంతో హుటాహుటిన హరీష్ రావు సిద్దిపేట నుంచి హైదరాబాద్ బయల్దేరారు. అయితే, ఇంత జరిగినా కేసీఆర్ ఇప్పుడైనా బయటకు వస్తారా? ఇదంతా రాజకీయాల్లో కామన్ అంటూ తను రావాలనుకున్నా టైమ్ కి వస్తారా? అని బీఆర్ఎస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కానీ, ఈ సమయంలో కేసీఆర్ బయటకు వస్తే మాత్రం రాజకీయాలు మరింత రంజుగా మారుతాయని చెప్పొచ్చు