SAKSHITHA NEWS

సమాతే ఖురాన్..మహిళల ఖుర్ఆన్ కూటమి

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

పవిత్ర ఖుర్ఆన్ గ్రంథం రమజాన్ నెలలో దివినుంచి భువికి అవతరించిన సందర్భాన్ని పురస్కరించుకుని ముస్లిములు ఉపవాసాలు పాటించడం, 30 ఖండాలుగా , 114 పాఠ్యాంశాలుగా ఉన్న ఖుర్ఆన్ పారాయణం విరివిగా చేస్తారు. జమాఅతె ఇస్లామీ హింద్ మహిళా శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా మహిళల సమాతే ఖురాన్ (ఖుర్ఆన్ కూటములు) జరుగుతున్నాయని జిల్లా అధ్యక్షురాలు సైదా భాను అన్నారు. నగరంలో ఖిల్లా శాఖ మహిళా అధ్యక్షురాలు రహిమున్నిసా. ఇంద్రనగర్ అధ్యక్షురాలు వహేదా, ఇస్లాంపేట అధ్యక్షురాలు ఫాతిమా ఆధ్వర్యంలో 100 చోట్ల సమాతే ఖురాన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రతి సమాతే ఖురాన్ కార్యక్రమంలో 20 నుంచి 30 మంది దాకా సమావేశమై రోజులో కొంతభాగం ఖుర్ఆన్ పారాయణం చేస్తున్నారు. అరబీలో చదివిన ఖుర్ఆన్ సూరాల అనువాదాన్ని తెలుసుకుంటున్నారు. ఖుర్ఆన్ లో ఉన్న ప్రవక్తల గాథలు, అల్లాహ్ ఆదేశాలు, షరీఅత్ విధి విధానాలు, జీవన రీతి, జీవిత పరమార్థం, ప్రళయం, పరలోక జీవితం తదితర ఎన్నో విషయాలపై అవగాహన చెందుతున్నారు. అల్లాహ్ తమకు ప్రసాదించిన హక్కుల గురించి అవగాహన పెంచుకుంటున్నారు. అల్లాహ్ అభీష్టం, మానవుని జీవన విధానం తెలియజేసే ఖుర్ఆన్ బోధనలు నిత్యజీవితంలో అలవర్చుకుంటేనే సాఫల్యం అని మహిళా పండితులు ఈ సమావేశాల్లో చెబుతున్నారు.పలుచోట్ల మహిళా పండితుల ఆధ్వర్యంలో జరిగే ఈ సమాతె ఖుర్ఆన్ సమావేశాలకు చక్కని స్పందన వస్తోంది. సోషల్ మీడియాలో సమాతె ఖుర్ఆన్ గ్రూపులు క్రియేట్ చేసుకుని ఎప్పటికప్పుడు ఖుర్ఆన్ సందేశాలను చేరవేసుకుంటున్నారు. ఖుర్ఆన్ చదవడం పూర్తయిన రోజున ఇఫ్తార్ పార్టీలు నిర్వహించుకుని ఖత్మె ఖుర్ఆన్ నిర్వహిస్తున్నారు
కొన్ని ప్రచురణ సంస్థలు రోమన్ ఇంగ్లీష్, రోమన్ తెలుగులో అరబీ శబ్దాలు వచ్చేలా ప్రచురించాయి. వాటి అనువాదాలు ట్రాన్సిలిటరేషన్లో మార్కెట్లో లభ్యమవుతున్నాయి. తమకు భాషరాదు, ఖుర్ఆన్ అర్థం చేసుకోలేము అన్న ప్రశ్నకు తావులేదు. ఎవరికి నచ్చిన భాషలో వారు సమాతె ఖుర్ఆన్ నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో చిన్నపిల్లలు, అమ్మాయిలు, గృహిణులు, వృద్ధ మహిళలు ఇలా అంతా కలిసి ఖుర్ఆన్ పారాయం, అనువాదాలు చదివి ఇస్లామ్ ధర్మంపై పరిజ్ఞానాన్ని పెంచుకుంటున్నారు. ఉపవాసాలు మొదలైన రోజు నుంచి పండుగకు కొన్ని రోజుల ముందు వరకు రోజుకు కొంతభాగం చదివి ఖుర్ఆన్ పఠనం పూర్తిచేస్తారు.


SAKSHITHA NEWS