SAKSHITHA NEWS

సాక్షితహైదరాబాద్:
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కేసీఆర్ రూ.25కోట్లు ఇచ్చారని ఈటల ఆరోపించగా.. ఈటల వ్యాఖ్యలపై రేవంత్ సవాల్ విసిరారు. బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు అబద్ధమని.. దీనిపై భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద తడిబట్టలతో ప్రమాణానికి సిద్ధమని టీపీసీసీ చీఫ్ సవాల్ విసిరారు. ఇదిలా ఉండగా… రేవంత్, ఈటల మధ్య జరుగుతున్న వార్‌పై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి శనివారం రోజున సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఇద్దరు నేతలకు చురకలంటించారు.

నిరంతర తెలంగాణ ఉద్యమకారిణిగా ప్రజల అభిప్రాయం చెప్పడం ఈ సందర్భంలో తన బాధ్యతన్నారు. బీఆర్‌ఎస్‌తో పోరాడే తమ్ముళ్లు రేవంత్, ఈటల తమ దాడిని ఒకరిపై ఒకరు చేసుకోవడం సరికాదని తెలిపారు. ఎవరి ధోరణిలో వారు ప్రభుత్వంపై పోరాడటం అవసరమేమో అనిపిస్తుందని సూచించారు. ఈ సందర్భంలో కొంచెం ఆలోచించాలని తెలంగాణ ప్రస్తుత పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న ఇద్దరికీ చెప్పడం తన బాధ్యత అని చెప్పుకొచ్చారు. దేశంలోనే అత్యంత ధన ప్రభావిత ఎన్నికల కార్యాచరణ తెలంగాణలో కొనసాగుతోందన్నారు. తెలంగాణ రాజకీయ కార్యకర్తలందరూ గత తొమ్మిది సంవత్సరాలుగా చూస్తున్న వాస్తవమిదని తెలిపారు. ఇందుకు కారణంగా ఉన్న అసలైన దుర్మార్గ వ్యవస్థపై పోరాడాల్సిన కర్తవ్యం మనకు తప్పనిసరిగా ఉన్నదనేది నిజమని చెప్పారు. ఈ విధానాన్ని అధికారపార్టీ ప్రజాస్వామ్య హనన రాజకీయ దుష్కృత్య ధోరణులపై కాక, ప్రతిపక్షాల నేతలు పరస్పరం చేసుకునే మాటల, సవాళ్ల దాడులు, బీఆర్‌ఎస్‌కు వేడుకలు అవుతున్నాయని విజయశాంతి పేర్కొన్నారు.


SAKSHITHA NEWS