రిషికేశ్: కేదార్‌నాథ్ యాత్రకు రిషికేశ్, హరిద్వార్‌లలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు అధికారులు ఆదివారం ప్రకటించారు. ఏప్రిల్ 30 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందన్నారు. గఢ్‌వాల్ హిమాలయ సానువుల్లో భారీ వర్షాలు, హిమపాతం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. వాతావరణ పరిస్థితులను పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. మంగళవారం నుంచి కేదార్‌నాథ్ ధామ్ తెరుచుకోనుండగా.. భక్తులు తగిన జాగ్రత్తలతో చార్‌ధామ్ యాత్రకు రావాలని, వెచ్చదనాన్నిచ్చే దుస్తుల్ని తప్పనిసరిగా తెచ్చుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
హెలికాప్టర్ రెక్కలు తగిలి ప్రభుత్వ అధికారి దుర్మరణం
సెల్ఫీ పిచ్చి కేదార్‌నాథ్‌లో ఓ ప్రభుత్వ అధికారి ప్రాణం తీసింది. కేదార్‌నాథ్ దామ్ హెలిప్యాడ్ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్ పౌర విమానయాన అభివృద్ధి ప్రాధికార సంస్థలో ఫైనాన్స్ కంట్రోలర్‌గా పనిచేస్తున్న జితేంద్ర కుమార్ సైనీ ఆదివారం హెలికాప్టర్‌తో సెల్ఫీ తీసుకునేందుకు దానికి దగ్గరగా వెళ్లారు. అనంతరం హెలికాప్టర్ తోక భాగంలోని రెక్కలు తగిలి మరణించారు.