SAKSHITHA NEWS

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో ఆందోళన
గతంలో విలువైన భూముల త్యాగం
మళ్లీ ఇక కుదరదు
ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవాల్సిందే..!
ప్రతిపాదిత డోర్నకల్ – మిర్యాలగూడ బీజీ రైల్వే లైన్ పై కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు , దక్షిణ మధ్య రైల్వే జీఎం కు ఎంపీ నామ నాగేశ్వరరావు లేఖ
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం పార్లమెంటరీ నియోజక వర్గ ప్రజలకు, రైతులకు ఇబ్బందికరంగా, తీవ్ర నష్టదాయకంగా పరిణమించిన ప్రతిపాదిత డోర్నకల్ – మిర్యాలగూడ రైల్వే లైన్ అలైన్మెంట్ మార్చి, ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకునేలా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు , దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ కు రాసిన రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రత్యామ్నా యంగా మోటమర్రి – విష్ణుపురం మార్గాన్ని ఎంచుకోవాలని నామ రైల్వే మంత్రికి సూచించారు. ప్రతిపాదిత డోర్నకల్ – మిర్యాలగూడ కొత్త బీజీ రైల్వే లైన్ వల్ల ఖమ్మం రూరల్ మండలం జాన్ బాద్ తండా, బోడా వీర తండా, దారేడు, గుండాల తండా, గుడూరుపాడు, ఎం. వెంకటాయపాలెం, అరేకోడు , అరేంపుల, బారుగూడెం, పొన్నెకల్, మద్దులపల్లి, తెల్దారుపల్లి, ముదిగొండ మండలం లక్ష్మీగూడెం, మేడేపల్లి, ధనియాగూడెం, కట్టకూర్, నేలకొండపల్లి మండలం అరేగూడెం, ఆచర్లగూడెం, కోనాయిగూడెం, నేలకొండపల్లి, బోదులబండ, పైనంపల్లి గ్రామాలు ప్రభావితం అవుతున్నాయని అన్నారు, ఈ గ్రామాల మీదుగా ఈ కొత్త బీజీ రైల్వే లైన్ ప్రతిపాదించడం వల్ల కోట్ల విలువైన భూములు, పేదల గృహాలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, ప్లాట్లు కోల్పోయి, ఆయా గ్రామాల ప్రజలు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైల్వే మంత్రికి తెలిపారు. గతంలో నాగార్జున సాగర్, జాతీయ రహదారులు, ఇతర అవసరాలకు రైతులు తమ విలువైన భూములను జాతీయ ప్రయోజనాల రీత్యా త్యాగం చేశారని , మళ్లీ ఇప్పుడు అరకొరగా మిగిలిన భూములు, విలువైన ప్లాట్లు , నివాస గృహాలు వదులుకోవడానికి సిద్ధంగా లేరని నామ నాగేశ్వరరావు రైల్వే మంత్రి దృష్టికి తీసికెళ్లారు. అందుకే ప్రతిపాదిత రైలు మార్గానికి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయా గ్రామ పంచాయతీలు తీర్మానాలను, ఆమోదించారని, వాటితో పాటు ప్రజా ప్రతినిధుల నుంచి స్వీకరించిన ప్రాతినిధ్యాలను కూడా ఈ లేఖతో జత చేసి,పరిశీలన కోసం పంపుతున్నట్లు నామ లేఖలో స్పష్టం చేశారు. ప్రభావిత గ్రామాలు, శివారు ప్రాంతాల్లోని ప్రజలు ఎక్కువుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన పేద వారని , వారంతా ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఈ వాస్తవ పరిస్థితులు, కారణాల దృష్ట్యా ప్రతిపాదిత డోర్నకల్ – మిర్యాలగూడ బీజీ రైలు మార్గం అలైన్మెంట్ ను మార్చి, ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవాలని ఎంపీ నామ నాగేశ్వరరావు రైల్వే మంత్రికి వివరించారు.


SAKSHITHA NEWS