విద్యా బిల్లును వ్యతిరేకించి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి….
— ఎంపీకి ఏఐఎస్‌ఎఫ్ బహిరంగ లేఖ…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి,
ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపాదిత విద్యా బిల్లును వ్యతిరేకించి, ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని కోరుతూ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణకు అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్) పెద్దపల్లి జిల్లా మండలి ఆధ్వర్యంలో బహిరంగ లేఖ విడుదల చేసినట్లు జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతిపాదిత విద్యా బిల్లును అఖిల భారత విద్యార్థి సమాఖ్య తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ఈ బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉండటంతో పాటు కేంద్ర, రాష్ట్రాల మధ్య సమాఖ్య విధానాన్ని బలహీనపరుస్తుందని, విద్యాసంస్థల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తుందని, ఉన్నత విద్యలో ప్రజాస్వామ్య విలువలు, సమాన అవకాశాలకు ముప్పు కలిగిస్తుందని పేర్కొన్నారు.
విద్యార్థులు, అధ్యాపకుల ప్రజాస్వామ్య హక్కులపై కూడా ఈ బిల్లు ప్రతికూల ప్రభావం చూపుతుందని అన్నారు. ప్రస్తుతం ఉన్న విశ్వవిద్యాలయాల మంజూరు సంఘం, సాంకేతిక విద్య మండలి, ఉపాధ్యాయ విద్య మండలి వంటి విద్యా నియంత్రణ సంస్థల స్థానంలో ఒకే అత్యున్నత విద్యా నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోందని తెలిపారు.
దీని వల్ల విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తి పూర్తిగా దెబ్బతింటుందని, ఉన్నత విద్యపై రాష్ట్రాలకు ఉన్న అధికారాలు కేంద్రం చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని ప్రతిష్ఠాత్మక ఉన్నత విద్యా సంస్థలు కూడా ఒకే నియంత్రణ పరిధిలోకి వస్తే వాటి స్వతంత్రత దెబ్బతింటుందని అన్నారు.
రాష్ట్ర విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తికి భంగం కలిగించే ఈ బిల్లు ప్రభుత్వ విద్య బలోపేతానికి విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈ అంశాలను సమగ్రంగా పరిశీలించి, ప్రభుత్వ విద్యను పరిరక్షించే దిశగా ప్రతిపాదిత బిల్లును వ్యతిరేకిస్తూ పార్లమెంటులో చర్చించాలని ఏఐఎస్‌ఎఫ్ తరఫున పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను కోరుతున్నట్లు రేణుకుంట్ల ప్రీతం తెలిపారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
