హృదయ విదారకం క్రికెట్ బాల్ కోసం బావిలోకి దిగిన విద్యార్థి మృతి.. రామగుండంలో విషాదం
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి:రామగుండం, పెద్దపల్లి జిల్లా రామగుండం మండలంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. రామగుండం మండల మోడల్ స్కూల్‌లో చదువుతున్న విద్యార్థి వెంచల సాత్విక్ (13) క్రికెట్ ఆడుతున్న సమయంలో బంతి బావిలో పడటంతో దానిని తీసుకొచ్చేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయాడు.
సమాచారం మేరకు, క్రికెట్ ఆడుతుండగా బంతి సమీపంలోని బావిలో పడింది. దానిని తీసుకురావడానికి బావిలోకి దిగిన సాత్విక్ ప్రమాదవశాత్తు నీటిలో చిక్కుకుని ఊపిరాడక మృతి చెందినట్లు తెలుస్తోంది.
మృతుడు రామగుండానికి చెందిన మధుకర్ కుమారుడు. ఈ విషాద ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు, తోటి విద్యార్థులు కన్నీరుమున్నీరుగా విలపించారు. రామగుండం ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు, సంబంధిత అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ, పాఠశాలల పరిసరాల్లో లేదా విద్యార్థులు సంచరించే ప్రాంతాల్లో ఉన్న బావులు, ప్రమాదకర ప్రదేశాలకు రక్షణ గోడలు, ఇనుప గ్రిల్లులు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే విద్యార్థుల భద్రతపై పాఠశాల యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
