బాలికల భద్రతపై అవగాహనతోనే రక్షణ

గోదావరిఖని ఉషోదయ హైస్కూల్‌లో నారింజ యూనిఫారాలు ధరించిన విద్యార్థులకు ఎస్‌ఐ లావణ్య గుడ్ టచ్–బ్యాడ్ టచ్, సైబర్ మోసాలు, మహిళల భద్రతపై అవగాహన కల్పించారు.

Sakshitha news

బాలికల భద్రతపై అవగాహనతోనే రక్షణ….

గుడ్ టచ్–బ్యాడ్ టచ్, పోక్సో చట్టం, సైబర్ మోసాలపై విద్యార్థులకు షీ టీమ్ అవగాహన….

సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/ మహిళలు, బాలికల భద్రతతో పాటు సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పెద్దపల్లి షీ టీమ్ ఆధ్వర్యంలో గోదావరిఖని రమేష్‌నగర్‌లోని ఉషోదయ హైస్కూల్‌లో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో షీ టీమ్ ఇన్‌చార్జి ఎస్‌ఐ లావణ్య విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ లావణ్య మాట్లాడుతూ గుడ్ టచ్, బ్యాడ్ టచ్, టీనేజ్‌లో ఎదురయ్యే సమస్యలు, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత, పోక్సో చట్టం తదితర అంశాలపై విద్యార్థులకు వివరించారు. సోషల్ మీడియా ప్రభావం పిల్లలపై ఎలా ఉంటుందో, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా ఎలా వినియోగించుకోవాలో వివరించారు. విద్యార్థులు క్రమశిక్షణతో వ్యవహరిస్తూ తమ ప్రవర్తనపై నియంత్రణ కలిగి ఉండాలని సూచించారు.

మహిళల భద్రత, ఆన్‌లైన్ మోసాలు, యాంటీ డ్రగ్స్‌పై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించారు. మహిళల రక్షణ కోసం ప్రతిరోజూ బస్టాండ్‌లు, ప్రధాన చౌరస్తాలు, జనసమీకరణ ప్రాంతాలు, కళాశాలల వద్ద షీ టీమ్ నిఘా ఉంటుందని తెలిపారు.

ఎవరైనా మహిళలు, విద్యార్థినులు వేధింపులకు గురైతే భయపడకుండా 6303923700 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యను తెలియజేయాలని సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. మహిళలకు ప్రమాదం ఉన్నా, ఎవరైనా బెదిరింపులకు పాల్పడినా వెంటనే 100/112కు ఫోన్ చేయాలని తెలిపారు.

ఆన్‌లైన్ మోసాలకు గురైనప్పుడు వెంటనే 1930కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
మహిళలు ప్రయాణ సమయంలో భద్రత కోసం టి-సేఫ్ యాప్ (T-Safe App)ను వినియోగించుకోవాలని ఎస్‌ఐ లావణ్య సూచించారు. విద్యార్థులు అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండటంతో పాటు, తమకు ఎదురయ్యే సమస్యలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసుల దృష్టికి వెంటనే తీసుకురావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్‌మాస్టర్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు, షీ టీమ్ సభ్యులు సురేష్, మౌనిక తదితరులు పాల్గొన్నారు.